టిబెట్‌లోని కైలాష్ - మానససరోవర యాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. యాత్ర సందర్భంగా ప్రతికూల వాతావరణం ఎదురు కావడంతో ఇందులో పాల్గొన్న ఆరుగురు భారతీయులు మృత్యువాత పడ్డారు. అదేసమయంలో స్థానికంగా చెలరేగిన ఘర్షణల కారణంగా నేపాల్- చైనా సరిహద్దులో చిక్కుకుపోయిన మరో 47మంది భారతీయులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
అధికారుల వివరాల ప్రకారం యాత్ర సందర్భంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎత్తైన ప్రాంతాల్లో సంచరించడంవల్ల వచ్చే అనారోగ్యం కారణంగా మే 22నుంచి ఈనెల 1వ తేదీ వరకు 6గురు మృతి చెందారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఐదుగురు ఉన్నారు.
వీరిలో ఇద్దరు కర్ణాటకకు చెందినవారు కాగా కాన్పూర్, లక్నో, కోయంబత్తూర్‌లకు చెందినవారు ఒక్కొక్కరున్నట్టు నేపాల్‌లోని భారతీయ దౌత్య కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా నేపాల్‌లో స్థానికంగా అల్లర్లు చెలరేగడంతో టిబెట్‌లోని పురంగ్ వద్ద చిక్కుకుపోయిన 47మంది భారతీయులు సురక్షితంగా బయటపడ్డారు.
వీరిలో 34మంది భారతీయులను దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసిన హెలికాప్టర్ల సాయంతో బుధవారం నేపాల్‌లోని హిల్సాకు తరలించారు. మిగిలిన 14మందిని మంగళవారమే సురక్షిత ప్రాంతానికి తరలించారు. వీరిలో అత్యధికులు వృద్ధులేనని దౌత్య కార్యలయ వర్గాలు పేర్కొన్నాయి.