ముల్లా ఒమర్, అల్ జవహరీలు బలూచిస్థాన్‌లో లేరు: పాక్

ఆఫ్ఘనిస్థాన్ తాలిబాన్ నాయకుడు ముల్లా ఒమర్, అల్‌ ఖైదా ఛీఫ్ అయిమన్ అల్ జవహరీలు తమ ప్రాంతంలో దాగిలేరని పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి అస్లామ్ రయిసాని గురువారం పేర్కొన్నారు. బలూచిస్థాన్ రాజధాని క్వెట్టా అమెరికా రాయబారి కామెరూన్ ముంటర్‌తో సమావేశం సందర్భంగా రయిసాని ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

మే 2న పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో అమెరికా ప్రత్యేక బలగాలు ఒసామా బిన్ లాడెన్‌ను హతమార్చిన అనంతరం ముల్లా ఒమర్, అల్ జవహరీ, ఇలియాస్ కాశ్మీరీతో పాటు పలువురు తీవ్రవాద నాయకులను చంపడం లేదా పట్టుకోవడం చేయాలని అమెరికా పాకిస్థాన్‌ను కోరింది.

గత కొన్ని వారాలుగా బలూచిస్థాన్‌లో తీవ్రవాదుల హింస పెచ్చరిల్లుతున్నది. ఈ హింసలో అల్ప సంఖ్యాక షియా వర్గానికి చెందిన 20 మంది మరణించారు. లాడెన్‌ను హతమార్చిన తర్వాత పలువురు తీవ్రవాద నాయకులు తరచుగా తమ స్థావరాలను మార్చుతున్నారు. భారత మోస్ట్ వాంటెడ్ నేరస్థుడు దావూద్ ఇబ్రహీం కూడా కరాచీ నుంచి ఇతర ప్రాంతానికి పారిపోయినట్లు వార్తలు వచ్చాయి.

వెబ్దునియా పై చదవండి