ముషారఫ్‌పై ఎఫ్ఐఆర్ నమోదుకు పాక్ కోర్టు ఆదేశం

గురువారం, 8 అక్టోబరు 2009 (09:25 IST)
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా బలూచిస్థాన్ హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. బలూచీ జాతీయ నేత నవాజ్ అక్బర్ బుగ్తీ హత్య కేసులో ముషారఫ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణ నిమిత్తం ముషారఫ్ కోర్టుకు హాజరుకావాలని గతంలో హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మాజీ అధినేత మాత్రం హైకోర్టు ఆదేశాలను ధిక్కరించారు.

పైపెచ్చు విచారణ సమయంలో ముషారఫ్ తరపు న్యాయవాదులు సైతం గైర్హాజరయ్యారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ముషారఫ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ అధ్యక్షుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, బుగ్తీ హత్య కేసులో ఆయన పాత్రపై విచారణ చేపట్టాలని డేరాబుగ్తీ జిల్లా పోలీసులకు హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

వెబ్దునియా పై చదవండి