ఇండోనేషియాలో శనివారం 5.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు స్థానిక జియోఫిజిక్స్ ఏజెన్సీ వెల్లడించింది. భూకంపం కారణంగా కలిగిన నష్ట వివరాలు వెనువెంటనే తెలియరాలేదు. ముకోముకోకు నైఋతి దిశలో 44 కిలోమీటర్ల దూరంలో వున్న బెంగ్కలూ ప్రావిన్స్‌లో 10 కి.మీల లోతులో ఉదయం 9.45 సమయంలో ఈ భూకంపం చోటుచేసుకుంది.
"బెంగ్కలూ ప్రాంతంలో సముద్ర గర్భంలో ఈ కంపం ఏర్పడింది. అయితే దీనికి నష్టాన్ని కలిగించే సామర్ధ్యం లేదు" అని ఇండోనేషియా జాతీయ భూకంప కేంద్ర అధికారి రిద్వాన్ పేర్కొన్నారు. భూకంపాలు అధికంగా సంభవించే పసిఫిక్ ప్రాంతంలో ఇండోనేషియాలో ఉంది. ప్రత్యేకించి సుమత్రా దీవిలో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి.