లండన్ అల్లర్లు కేవలం లూటీల కోసమే: కామెరూన్

లండన్‌లో జరుగుతున్న అల్లర్లు కేవలం లూటీల కోసమేనని బ్రిటన్ ప్రధాన మంత్రి కామెరూన్ స్పష్టం చేశారు. ఈ అల్లర్ల వెనుక రాజకీయాలు లేదా ఇతర కారణాలు లేవన్నారు. అల్లర్లను అదుపులోకి తీసుకుని రావడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోతుందన్నారు.

ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా బ్రిటన్‌ను అతలాకుతలం చేస్తున్న అల్లర్లపై చర్చించేందుకు కామెరాన్, పార్లమెంట్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీధుల్లో భయానక వాతావరణాన్ని ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేది లేదని ఆయన మరోమారు స్పష్టం చేసారు. అయితే అల్లర్లు చెలరేగిన సోమవారం రాత్రి తక్కువమంది పోలీసులను మాత్రమే నియోగించినట్టు ఆయన అంగీకరించారు.

దేశంలోని వివిధ నగరాల్లో చోటు చేసుకుంటున్న అల్లర్ల విషయం తెలిసిన వెంటనే.. వేసవి సెలవుల పర్యటనకోసం ఇటలీలో వున్న కామరాన్ తక్షణమే స్వదేశం తిరిగి వచ్చిన నేపథ్యంలో.. అల్లర్ల కారణంగా నష్టపోయిన వ్యాపారులు, గృహ యజమానులకు ఒక ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి