లండన్ ప్రజలు తిరగబడ్డారు. లాకప్ డెత్‌ను నిరసిస్తూ వీధుల్లో బీభత్సం సృష్టించారు. ఖాకీల దాష్టీకాన్ని నిలదీస్తూ పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డారు. భారీ సంఖ్యలో వాహనాలను ధ్వంసం చేశారు. పలు భవనాలకు నిప్పుపెట్టారు. అడ్డుకున్న పోలీసులపైనా రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటన బ్రిటన్ దేశాన్ని ఒక్కసారిగా వణికించింది. లాకప్‌డెత్‌పై ప్రజల నుంచి ఇంత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో లండన్ పోలీసులు ఖంగుతున్నారు.
లండన్‌లో టోటెన్హమ్ ప్రాంతంలో ఆయుధ నేరం కింద అరెస్టు అయిన మార్క్ డుగ్గన్ అనే వ్యక్తి... పోలీసుల చిత్రహింసలు భరించలేక లాకప్‌లోనే కన్నుమూశాడు. ఆయనకు నలుగురు పిల్లలున్నారు. దీంతో మృతుని బంధువులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పోలీసు స్టేషన్ చేరుకుని ధర్నాకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దీంతో వారిని అదుపు చేయడానికి పోలీసులు ప్రత్యేక బలగాలను రప్పించడమే కాకుండా... కవ్వింపు చర్యలకు దిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు విచక్షణా రహితంగా లాఠీచార్జి చేయడంతో పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు గాయపడ్డారు. ఖాకీల దౌర్జన్యాన్ని తట్టుకోలేక ఓ పదహారేళ్ల యువతి పోలీసులపై రాయి విసరడంతో... ఆమె తెగువ స్ఫూర్తితో ప్రజలు రెచ్చిపోయారు. పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు.