శ్రీలంకలో ఇటీవల ముగిసిన యుద్ధంలో లొంగిపోయిన ఎల్టీటీఈ తీవ్రవాదులను ఆ దేశ సైన్యం కాల్చిచంపిందని మానవ హక్కుల సంస్థ ఒకటి ఆరోపించింది. వేర్పాటువాద ఎల్టీటీఈని అణిచివేసేందుకు శ్రీలంక సైన్యం రెండేళ్ల క్రితం చేపట్టిన తుది దశ పోరు గత నెలలో ముగిసిన సంగతి తెలిసిందే. యుద్ధం చివరి నెలల్లో అనేక మంది ఎల్టీటీఈ తీవ్రవాదులు లంక సైన్యానికి లొంగిపోయారు.
వీరిని కాల్పిచంపిన సైనికులు, యుద్ధంలో గాయపడిన పౌరులను సైతం ప్రాణాలతో ఉండగానే మరణించినవారితో పూడ్చిపెట్టారని యూనివర్శిటీ టీచర్స్ ఫర్ హ్యూమన్ రైట్స్ (జాఫ్నా) గ్రూపు తన నివేదికలో వెల్లడించింది. ఇదిలా ఉంటే శ్రీలంకకు చెందిన మరో మానవ హక్కుల సంస్థ తన నివేదికలో యుద్ధం చివరి రోజుల్లో వేలాది మంది పౌరల మరణాలకు, హత్యలకు, వేధింపులకు ఎల్టీటీఈ కారణమని పేర్కొంది.