సిరియాకు వ్యతిరేకంగా భారత్‌ చర్యలు తీసుకోవాలి: హిల్లరీ

శుక్రవారం, 12 ఆగస్టు 2011 (14:03 IST)
సిరియాకు వ్యతిరేకంగా భారత్ కూడా తగిన చర్యలు తీసుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అభిప్రాయపడ్డారు. అలాగే, సిరియా అధ్యక్షుడు గద్దెదిగాలని ఐక్యరాజ్య సమితి ఎందుకు కోరడం లేదని ఆమె ప్రశ్నించారు. సిరియా అధ్యక్షుడు బషార్ అల్ అసాద్ ఆ దేశ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారన్న కఠోర వాస్తవాన్ని తమ దేశం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నామని ఆమె తెలిపారు.

ఈ విషయంలో కేవలం ఒక్క అమెరికా చర్యలే కాకుండా ఇతర ప్రపంచ దేశాల మద్దతు కూడా కావాలన్నారు. సిరియాలో పాలనాపరమైన సంస్కరణలు కోరుతూ గత ఐదు నెలలుగా ఆందోళన చేస్తున్న ఆందోళనకారులపై ఆ దేశ భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్న విషయం తెల్సిందే.

ఇది సిరియా దేశ వ్యాప్తంగా సాగుతున్నాయన్నారు. అందుకే సిరియాపై చమురు, సహజవాయవుల నిషేధాన్ని విధించినట్టు ఆమె తెలిపారు. ఈ ఆంక్షలు అమెరికాలోని సిరియాకు చెందిన పలు బ్యాంకులు, వాణిజ్య సంస్థలు, మొబైల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్‌లపై కొనసాగుతాయని చెప్పారు.

ఈ విషయంలో యూరోప్‌తో సహా చైనా వంటి దేశాలు కూడా మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా ఆందోళనను పట్టించుకోని సిరియాపై తాము మరిన్ని ఆంక్షలు విధించనున్నట్టు తెలిపారు. ఇవన్నీ సిరియా అధ్యక్షుడిపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఆంక్షలు విధించామని, అందువల్ల ఇతర దేశాలు కూడా తమను అనుసరించాలని హిల్లరీ క్లింటన్ పిలుపునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి