ఘర్షణలతో అట్టుడికిపోతున్న సిరియాతో ఉన్న సంబంధాలను ప్రపంచ దేశాలన్నీ తెగతెంపులు చేసుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ పిలుపునిచ్చారు. సిరియా నుంచి ఇంధనం, వంట గ్యాస్ వంటివి ప్రపంచ దేశాలు దిగుమతి చేసుకుంటూ, ఆయుధాలను ఎగుమతి చేయడం వంటి చర్యలు సిరియా దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్‌కు మరింత తోడ్పాటు ఇచ్చినట్టే అవుతుందని ఆమె పేర్కొన్నారు.
దీనిపై ఆమె వాషింగ్టన్‌లో మాట్లాడుతూ సిరియాలో పాలనాపరమైన సంస్కరణలు చేపట్టాలని, నాలుగు దశాబ్దాల అసద్ పాలనకు చరమగీతం పాడాలని కోరుతూ సిరియా ప్రజలు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఈ ఆందోళనపై అసద్ తమ దేశ సైనిక బలగాలతో ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ చర్యల్లో ఇప్పటి వరకు 1400 మంది వరకు మృత్యువాత పడ్డారు.
ఈ చర్యను అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇందుకు ప్రతిగా సిరియాపై వివిధ రకాల ఆర్థిక ఆంక్షలను విధించి అమలు చేస్తోంది. అలాగే, ఐక్యరాజ్య సమితి పోటా ప్రపంచ దేశాలన్ని సిరియాతో ఉన్న సంబంధాలను తెంచుకోవాలని ఆమె పిలుపునిస్తున్నారు.
ఇదిలావుండగా, శుక్రవారం చెలరేగిన అల్లర్లలో 16 మంది ఆందోళనకారులు చనిపోరారు. కాగా, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్ దేశాలు సిరియాలోని తమతమ రాయబారులను వెనక్కి పిలిపించాయి.