ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న స్వైన్‌ఫ్లూ మహమ్మారి వ్యాధిని అరికట్టేందుకు రష్యా దేశం రెండు వ్యాక్సిన్‌లను కనుగొంది.
స్వైన్‌ఫ్లూ మహమ్మారి వ్యాధిని అరికట్టందుకుగాను తాము రెండు రకాల వ్యాక్సిన్‌లను కనుగొన్నామని దీనికి సంబంధించి ఉత్పత్తులు ప్రారంభించామని రష్యాదేశపు ఉప ఆరోగ్యశాఖామంత్రి వెరోనికా స్క్వోర్త్సోవా అన్నారు.
తాము కనుగొన్న వ్యాక్సిన్‌లను దాదాపు 35.5 మిలియన్ల సింగిల్ డోస్‌లను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలను రూపొందించామని, దీనిని ఈ ఏడాదికల్లా పూర్తి చేస్తామని ఆమె వెల్లడించారు.
ఇటీవలే వీటిని ప్రాథమికంగా ఉపయోగించి చూసామని, ఇందులో మంచి ఫలితాలు కనపడుతున్నాయని ఆమె అన్నారు.
తాము కనుగొన్న వ్యాక్సిన్ వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌లుండవని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే తాము ఈ వ్యాధిబారిన పడిన పిల్లలు, మహిళలపై వ్యాక్సిన్‌ను ప్రయోగించామని, ప్రస్తుతం వారు కోలుకుంటున్నారని ఆమె తెలిపారు.
ఇదిలావుండగా తమ దేశంలో స్వైన్‌ఫ్లూ మహమ్మారి వ్యాధిబారిన పడినవారు దాదాపు 591 మంది ఉన్నారని రష్యా దేశానికి చెందిన శానిటరీ విభాగాధికారి గెన్నడి తెలిపారు. వీరంతా కూడా విదేశాలనుంచి వచ్చినవారేనని, అక్కడినుంచి వస్తూ...వస్తూ వీరు ఈ వ్యాధితో వచ్చారని, రెండు రోజుల క్రితం వీరి సంఖ్య 570గా ఉండిందని, ప్రస్తుతం అదే సంఖ్య 591కి చేరుకుందని ఆయన వివరించారు.
కాగా ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి వ్యాధి బారిన పడిన వారు 340,000 మంది ఉన్నారని, ప్రపంచవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 4,100కు చేరుకుందని ఆయన తెలిపారు.