పిల్లల నైతిక సంబంధాలపై ఇంటర్నెట్‌ ప్రభావం

సాంకేతిక రంగం తెచ్చిన పెనుమార్పుల్లో ఇంటర్నెట్ ఒకటి. కంప్యూటర్ సాయంతో ప్రపంచం మొత్తాన్ని ఇంటర్నెట్‌లో చూడటం, కావలసిన సమాచారాన్ని పొందటం లాంటివి చేయవచ్చన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ ఇంటర్నెట్ తెచ్చిన మంచితోపాటు చెడు కూడా అంతే ఉంది.

ఎందుకంటే, పిల్లల సాంఘిక, కుటుంబ, నైతిక సంబంధాలపై ఇంటర్నెట్ తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. దీనికి అలవాటు పడ్డ పిల్లలు ఎన్నో రకాల సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పిల్లల ఇంటర్నెట్ వాడకంపై తల్లిదండ్రులు నిఘా ఉంచటం ఎంతైనా అవసరం.

ముందుగా చిన్నారులు ఇంటర్నెట్‌కు ఎంతమేరకు అడిక్ట్ అవుతున్నారో గమనించాలి. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా... ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడు పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారో లేదో గమనించాలి. స్నేహితులు, బంధువులతో కంటే ఇంటర్నెట్‌తోనే ఎక్కువసేపు గడుపుతున్నారా, లేదా అన్న విషయాన్ని పరిశీలించండి.

అలాగే నెట్‌లో ఎంతసేపు గడపాలన్న విషయాన్ని మీరు చెప్పినట్లయితే, పిల్లలు కోప్పడుతున్నారో, లేదా అన్న అంశాన్ని కూడా గమనించండి. అలాగే నెట్‌లో పరిచయమైన వ్యక్తులు మీ చిన్నారులు ఫోన్ చేస్తున్నారా అన్న విషయాన్ని పరిశీలించండి. పిల్లలు రోజు మొత్తంలో చాలా సమయం కంప్యూటర్‌తోనే గడుపుతున్నట్లయితే దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

ఇకపోతే... తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు ఇంటర్నెట్‌ను కనెక్ట్ చేస్తూ పట్టుబడటం, నెట్‌లో ఏం చూస్తున్నావ్ అని ప్రశ్నిస్తే అబద్ధాలు చెప్పడం, నెట్ ఎక్కువగా చూడవద్దని ఎంత చెప్పిన ఆ అలవాటు మానుకోకపోవడం, ఇతర పనులను పక్కనపెట్టి మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండిపోవటం లాంటి వాటిని కూడా జాగ్రత్తగా గమనించాలి.

పైన చెప్పిన విషయాలను అన్నింటినీ పరిశీలించిన మీదట.. చిన్నారులు ఇంటర్నెట్‌కు బాగా అడిక్ట్ అవుతున్నారా, పరిమితిలో ఉన్నారా అన్న విషయాలను తల్లిదండ్రులు బేరీజు వేసుకోవాలి. బాగా అడిక్ట్ అయిన చిన్నారులను మాత్రం దాన్నుంచి వెంటనే దూరం చేసేలా ప్రయత్నించాలి. అయితే బలవంతంగా మాత్రం ఆ పని చేయకూడదు. మెల్లి మెల్లిగా ఆ పరిస్థితినుంచి చిన్నారులను దూరం చేసే విధంగా తల్లిదండ్రులు ఓపికగా ప్రయత్నించాలి. లేకపోతే చిన్నారులను ఇబ్బందుల్లో నెట్టినవారవుతారు.

వెబ్దునియా పై చదవండి