పాఠశాల పాఠ్య పుస్తకాలలో లైంగిక విద్య (సెక్స్ ఎడ్యుకేషన్)ను ప్రవేశపెట్టడంపై పార్లమెంటరీ కమిటీ విముఖత వ్యక్తం చేసింది. లైంగిక విద్యపై అవగాహన కలిగించేందుకు అవసరమైన పాఠ్యాంశాలను ఇంటర్ జీవశాస్త్రం పాఠ్య పుస్తకంలో ప్రవేశపెడితే సరిపోతుందని కమిటీ సూచించింది.
రాజ్యసభ ఫిర్యాదులపై ఏర్పాటయిన పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రకారం... "పెళ్లికి ముందు సెక్స్ వద్దని పాఠశాల విద్యార్థులకు చెప్పడం అనైతికం, అనారోగ్యకర"మని పేర్కొంది. కాబట్టి... పాఠశాలలో లైంగిక విద్యకు సంబంధించిన పాఠ్యాంశాలు ఉండాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని కమిటీ స్పష్టం చేసింది.
ఈ పార్లమెంటరీ కమిటీకి నేతృత్వం వహించిన భారతీయ జనతా పార్టీ (భాజపా) సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ... వివాహేతర సెక్స్ సమాజ ధర్మాలకు విరుద్ధమైందనే అంశంపా విద్యార్థులను చైతన్యవంతం చేయాలని పేర్కొన్నారు.
అలాగే... బాల్య వివాహాలు చట్టవిరుద్ధమని, ఇది బాలికల ఆరోగ్యానికి హానికరమని విద్యార్థులకు తెలియజేయాలని కమిటీ అభిప్రాయపడింది. పరస్పర అంగీకారంతోనే 16 ఏళ్లలోపు బాలబాలికలతో సెక్స్ జరిపినా అది అత్యాచారమే అవుతుందన్న విషయాన్ని విద్యార్థులకు అర్థం చేయించాల్సిన అవసరం ఉందని కమిటీ వ్యాఖ్యానించింది.