తులసీ పూజ చేస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయట!

శుక్రవారం, 29 మే 2015 (17:26 IST)
దైవారాధనకు ప్రాధాన్యం ఇచ్చే ప్రతి ఇంటి ఆవరణలోనూ తులసి మొక్క వుంటుంది. తులసీ పూజ చేస్తే ఆ కుటుంబానికి సిరిసంపదలకు ఎలాంటి లోటువుండదని పండితులు అంటున్నారు. హనుమంతుడు సీతమ్మ తల్లికోసం లంకలోకి ప్రవేశించినప్పుడు అక్కడి ఆవరణలో తులసి మొక్కను చూసి ఆ గృహిణి గురించిన అంచనా వేస్తాడు. 
 
తులసి మొక్కకు పూజలు చేయడం ఏనాటినుంచో గల ఆచారం. పిల్లల్లేనివారు తులసి వివాహం ఏర్పాటుచేసేవారు. తులసి ఆకుల్లేకుండా విష్ణుపూజ చేయరు. విష్ణు భగవానుడి నివేదనలో, చరణామృత, పంచామృతాలతో తులసి ఆకులు తప్పనిసరిగా వుండాలి. మరణశయ్యపై వున్నవారి గొంతులో తులసి తీర్థం పోస్తారు. 
 
తులసి మొక్కకు వున్నంతటి మతపరమైన గుర్తింపు, ప్రాధాన్యం మరే మొక్కకూ లేదు. ఈ విశ్వాసాలన్నింటి వెనుకా శాస్త్రీయ కారణాలున్నాయి. తులసి దైవత్వం ఆపాదించుకున్న ఔషధ మొక్క. కస్తూరి మాదిరి మరణించే మనిషికి జీవనమిచ్చే శక్తిగలది. 
 
ఆయుర్వేద పుస్తకాలలో తులసి ప్రస్తావన విస్తృతంగా కనిపిస్తుంది. నీటిలో తులసి ఆకులు మరిగించి జ్వరం, జలుబు, దగ్గు, మలేరియాలతో బాధపడుతున్నప్పుడు తాగితే తక్షణ ఉపశమనం కలుగుతుంది. 

వెబ్దునియా పై చదవండి