ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ నుంచి క్విటోవా ఔట్

ఆదివారం, 1 జూన్ 2014 (11:49 IST)
ఫ్రెంచ్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్‌లో సంచలనాల మోత మోగుతోంది. మూడోరౌండ్ దాటకుండానే మరో ఇద్దరు స్టార్ క్రీడాకారిణులు ఇంటిదారి పట్టారు. నా లి, సెరెనా, రద్వాన్‌స్కా సరసన క్విటోవా, ఇవనోవిచ్ కూడా చేరారు. కాగా టాప్ సీడ్ రఫెల్ నడాల్ ప్రీక్వార్టర్స్ చేరగా.. మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) ప్రీ క్వార్టర్స్, మిక్స్‌డ్‌లో రోహన్ బోపన్న-స్రెబోత్నిక్ (స్లొవేకియా) జోడీ క్వార్టర్స్ చేరింది. అయితే సానియా-టెకావ్ జోడీ మిక్స్‌డ్ రెండో రౌండ్‌లో ఓడింది.
 
శనివారమిక్కడ జరిగిన మూడోరౌండ్లో ఐదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 7-6 (3), 1-6, 7-9తో 27వ సీడ్ స్వెత్లానా కుజ్నెత్సొవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో సెర్బియా భామ, 11వ సీడ్ అనా ఇవనోవిచ్ 3-6, 3-6తో వరుస సెట్లలో 23వ సీడ్ సఫరోవా (చెక్ రిపబ్లిక్) చేతిలో చిత్తయింది. 
 
కాగా, నాలుగో సీడ్ హలెప్ (రుమేనియా) 6-3, 6-0తో టోరో ఫ్లోర్ (స్పెయిన్)పై అలవోక విజయంతో ప్రీ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఆరో సీడ్ జలెనా జంకోవిచ్ (సెర్బియా) 6-1, 6-2తో క్రిస్టియా (రుమేనియా)పై, పదో సీడ్ ఎరాని (ఇటలీ) 6-0, 6-1తో గ్లుష్కో (ఇజ్రాయిల్)పై సులువుగా నెగ్గారు. 15వ సీడ్ స్టీఫెన్స్ (అమెరికా) 6-3, 6-4తో 22వ సీడ్ మకరోవా (రష్యా)పై గెలిచింది.
 

వెబ్దునియా పై చదవండి