విశ్వనాథన్ ఆనంద్‌కు మాతృవియోగం.. నిద్రలోనే మృత్యు ఒడిలోకి..

బుధవారం, 27 మే 2015 (16:41 IST)
చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్‌కు మాతృవియోగం కలిగింది. ఆనంద్ తల్లి సుశీల (89) బుధవారం నిద్రలోనే మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. చదరంగంలో తల్లే ఆనంద్‌కు తొలి గురువు. ఆమె వద్ద నేర్చుకున్న పాఠాల పునాదే విషీని అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన క్రీడాకారుడిగా నిలిపింది. కాగా, ఆమె మృతికి అఖిల భారత చెస్ సమాఖ్య సంతాపం వ్యక్తం చేసింది.
 
ప్రపంచ చదరంగం క్రీడలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. పిన్న ప్రాయంలోనే చెస్ క్రీడలో నైపుణ్యం సంపాదించాడు. 14వ ఏటనే సబ్-జూనియర్ జాతీయ చెస్ చాంపియన్‌షిప్ సాధించాడు. 1985లోనే ఇంటర్నేషనల్ మాస్టర్‌గా అవతరించాడు. 
 
16వ ఏటనే 1985 లో జాతీయ చాంపియన్ షిప్ చేజిక్కించుకున్నాడు. 1987లోనే ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్ షిప్ సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఆ సమయంలోనే గ్రాండ్ మాస్టర్‌గా అవతరించాడు.

వెబ్దునియా పై చదవండి