గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పాలనా పగ్గాలు కట్టబెట్టేందుకు ఊరూరా తిరిగిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తనకు రాజకీయాల వాసనే సరిపడటం లేదని అంటున్నాడట. అయినా రాజకీయాల గురించి కాస్త వయసు మళ్లిన తర్వాత ఆలోచిస్తానంటున్నాడట. స్వర్గీయ ఎన్టీఆర్ మనవడిగా ఆయన నట వారసత్వాన్ని అందుకున్నందుకు తొలుత నటనలో ఉన్నత స్థానాన్ని ఆక్రమించి తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్న తర్వాత రాజకీయాల వైపు తొంగి చూస్తానని చెపుతున్నాడట.
సడెన్‌గా జూనియర్ ఎన్టీఆర్‌లో ఈ మార్పు రావడానికి కారణం ఏమిటోనని ఫిలిమ్ నగర్ వర్గాలు ఆరా తీయగా వారికి ఓ విషయం బోధపడిందట. అదేమంటే... ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నవారు ఒకవైపు తెలంగాణా... మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమాల సెగతో వేడెక్కిపోతున్నారు. "ఎందుకొచ్చిన రాజకీయాలు బాబోయ్..." అని తలలు పట్టుకుని ఇంట్లో కూచుంటున్నారు.
ఆయా ప్రాంతాల ప్రజలకు సమాధానం చెప్పలేక కొందరైతే వారి వారి నియోజకవర్గాలవైపు కన్నెత్తైనా చూడలేకపోతున్నారు. కనుక ఈ సమస్య తీరేదాకా కొత్తవారు రాజకీయాల జోలికి వెళ్లే ప్రశ్నే లేదు. ఇక తారలైతే మరీను. ఒక ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడితే మరో ప్రాంత ప్రజలు తమ వాల్ పోస్టర్లను చింపి కుప్పలుగా వేసేస్తారు. కనుక ఈ సమయంలో తారలు రాజకీయాల జోలికి వెళితే అంతే సంగతులు. సో... జూనియర్ ఎన్టీఆర్ డెసిషన్ 100% కరెక్ట్!!