ఆయన ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు కావచ్చు కానీ మన ఇంద్రానూయి ముందు మాత్రం తీసికట్టే. సంపద విషయంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను వెనక్కు నెట్టిన బెర్క్‌షైర్ హాత్‌వే అధినేత వారెన్ బఫెట్‌ను మన ఇంద్రానూయి మరో రకంగా దెబ్బతీశారు.
ఆయన కన్నా 81 రెట్లు అధిక రాబడిని ఇంద్రానూయి అందుకుంటున్నట్టు ఇటీవలి సర్వేలో వెల్లడైంది. అంతేకాక బఫెట్ వార్షిక రాబడిని మరో ఇద్దరు భారత సంతతి పౌరులు అధిగమించారు.
న్యూయార్క్ టైమ్స్‌కోసం ఈక్విలార్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. పెప్సికో సీఈవోగా ఉన్న ఇంద్రానూయి 2007లో 14.74మిలియన్ డాలర్ల రాబడి సాధించగా, బఫెట్ కేవలం 0.18 మిలియన్ డాలర్లు మాత్రమే సంపాదించారని ఆ సంస్థ విడుదల చేసిన గణాంకాల ద్వారా తేలింది.
ఆమె మాత్రమే కాక సిటీ గ్రూప్ సీఈవోగా ఉన్న మరో ప్రవాస భారతీయుడైన విక్రం పండిట్ కూడా బఫెట్ కన్నా 17 రెట్లు అధికంగా రాబడి అందుకున్నారని తెలిపింది. అలాగే రోమ్ అండ్ హాస్ రసాయన సంస్థ సీఈవో రాజీవ్ గుప్తా కూడా బఫెట్‌కన్నా నలభై శాతం అధిక రాబడి అందుకున్నారని వెల్లడించింది.
అమెరికాలో 6.5 బిలియన్ డాలర్లకు పైగా రాబడి కలిగిన 200భారీ పబ్లిక్ సంస్థల కార్పొరేట్ నివేదికలను పరిశీలించిన మీదట ఈక్విలార్ ఈ నివేదిక వెల్లడించింది. ఐపాడ్ తయారీ సంస్థ యాపిల్ సీఈవో స్టీవ్ జాబ్స్ ఈ జాబితాలో చివర ఉండటం గమనార్హం.