కంప్యూటర్‌లో ఓనమాలు రాని ఎలిజబెత్ రాణి

గురువారం, 25 సెప్టెంబరు 2008 (14:09 IST)
FileFILE
నేను ఈ రోజువరకూ కంప్యూటర్‌ ఉపయోగించలేదు అని ఎవరైనా సిగ్గుపడుతూ చెబితే చాలామంది దాన్ని సరదాగానే తీసుకుంటారు. కాని అలా అన్న వ్యక్తి చరిత్ర ప్రసిద్ధురాలు అయితే.. ఒక దేశ చరిత్రలో ఎన్నో నిర్ణాయక ఘట్టాలకు సాక్షీభూతురాలయితే... ఆమె ఎవరో కాదు బ్రిటిష్ రాణి ఎలిజబెత్ మహారాణి...

ఆమె అఖండ బ్రిటిష్ సామ్రాజ్యానికి అధినేత్రి. ఒక కనుసైగ చేస్తే చాలు వందలాది సేవకులు ఇట్టే వచ్చి వాలిపోయేంత అత్యంత సంపన్నురాలు ఆమె. కానీ ఆమెకూ సమస్యలు ఉన్నాయి అంటే నమ్మగలరా.. అవేమిటో కాదు.. ఆమెకు కంప్యూటర్ గురించి ఓనమాలు తెలీవు మరి.
గేట్స్‌ముందు తలవంచిన రాణి..
  ఎంతవారలైనా కాంతాదాసులే అనే పాత సామెతను కాస్త మార్చి.. ఎంతవారలైనా కంప్యూటర్ దాసులే అంటే బాగుంటుందేమో కదూ.. 82 ఏళ్ల వయసులో ఒకానొక సిగ్గుపడిన క్షణంలో కంప్యూటర్‌ పని పట్టి సాధించిన ఎలిజబెత్‌ నిజంగా లేటు వయసులోను లక్ష్యాన్ని జయించారు.      


ఎంతటివారికైనా ఏదో ఒక సమయంలో జ్ఞానోదయం అవుతుందంటారు కదా.. బ్రిటిష్ రాణికి కూడా అది ఇటీవలే అనుభవమైంది. 2005లో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌కు గౌరవ నైట్‌హుడ్ బహుకరించిన సందర్భంగా ఆమె ఒకింత సిగ్గు పడుతూ.. ఈరోజు వరకు తాను కంప్యూటర్ ఉపయోగించలేదని చెప్పారు. ఆమాట చెప్పడానికే ఆమె మహా సిగ్గుపడిపోయారు.

బిల్‌గేట్స్‌తో పరిచయ ప్రభావమేమో మరి... ఆ తర్వాతనుంచి ఎలిజబెత్ రాణి ఇంటర్నెట్ ప్రపంచంలో విహహరించడం మొదలెట్టారు. తన చుట్టాలు, కుటుంబ సభ్యులు అందరికీ ఆమె ఇప్పుడు ప్రతిరోజూ ఇమెయిల్స్ పంపుతున్నారు. గత సంవత్సరం ప్రిన్స్ విలియమ్ ఆమెకు ఓ ఐపాడ్ కూడా బహుకరించారని లండన్ పత్రిక తెలిపింది.

రెండేళ్ల క్రితం వరకు కంప్యూటర్ ఎలా వాడాలో తెలీని బ్రటిష్ మహారాణి గత సంవత్సరం క్రిస్మస్ సందేశాలు పంపేందుకు ఏకంగా యూట్యూబ్‌లో తన సొంత ఛానెల్ ప్రారంభించేశారు. ఇప్పుడు తన 82వ ఏట గూగుల్ కార్యాలయానికి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అంటే చెవికోసుకునే డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్‌తో కలిసి ఎలిజబెత్ త్వరలో గూగుల్ కార్యాలయాన్ని సందర్శించనున్నారు.

వెబ్దునియా పై చదవండి