కూచిపూడి కూడు పెట్టలేదు - శోభానాయుడు

శనివారం, 4 అక్టోబరు 2008 (16:47 IST)
FileFILE
'కూచిపూడి నృత్యం తిండి పెడుతుందా అంటే ఏం సమాధానం చెప్పాలి. అవునని చెప్పగలిగే ధైర్యం నాకు లేదు. పోనీ భవిష్యత్తైనా ఉందాంటే అదీ లేదు... అడిగేవారికి ఏమని సమాధానం చెప్పమంటారు చెప్పండి.. అందుకే ఏమి చేయలేకపోతున్నాను' ఇలా మాట్లాడింది ఎవరో తెలుసా... పేరు వింటే ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది.

సాక్షాత్తు ప్రముఖ నృత్య కళాకారిని పద్మశ్రీ శోభానాయుడు. తన అద్భుత నృత్యంతో ఆహుతులను కట్టిపడేయగల సత్తా ఉన్న ఆమె శుక్రవారం సాయంత్రం చెన్నైలో చాలా నిరాశజనకంగా, నిరుత్సాహింగా మాట్లాడారు. అడుగడుగునా కళలకు జరుగుతున్న నిరాదరణను గుర్తు చేసుకుని తీవ్రంగా ఆవేదన చేశారు.

ఇక్కడ శనివారం ప్రదర్శన ఇచ్చేందుకు ఇక్కడకు విచ్చేసిన ఆమె విలేకరులతో మాట్లాడారు. కూచిపూడిలాంటి నాట్యాలు నేర్చుకోవడం వలన ఉద్యోగాలు వస్తాయని, భవిష్యత్తు ఉంటుందని, ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పే సాహాసం తాను చేయలేకపోయాన్నారు. అందుకే ధైర్యంగా ఎవరినీ ఈ కళలో నిలవమని చెప్పలేకపోయానని చెప్పారు.

వారు అడిగే ప్రశ్నలకు ఈ వృత్తి ద్వారా ఫలానా లబ్ధి ఉంటుందని తాను ఏ మాత్రం భరోసా ఇవ్వలేకపోయానని వాపోయారు. పరాయి దేశాలలో భారతీయ కళల పట్ల విపరీతమై స్పందన కనిపిస్తోందన్నారు. అదే సమయంలో కళలకు పుట్టినల్లయిన భారతదేశంలో ఆధరణ దిగజారుతోందన్నారు.

గతంలో కళలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా మృగ్యమైపోయాయని ఆవేదన చెందారు. ప్రభుత్వాలు చేయదగింది ఎంతో ఉన్నా ఉలుకూ పలుకూ లోకుండా ఉండిపోయాయని ఆరోపించారు. ప్రపంచంలో భారతీయ చరిత్రను చాటి చెప్పిన ఈ కళలకు పాఠ్యాంశాలలో చోటు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ వృత్తి ద్వారా ఆత్మానందం మినహా ఒనగూరేదేమి ఉండదని నిట్టూర్చారు.

వెబ్దునియా పై చదవండి