చదువుకునే రోజుల్లో, అప్పుడే ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్న రోజుల్లో మనలాగే కనాకష్టాలు పడిన బ్రిటన్ మహిళలు వారు. టాయ్‌లెట్లు కడిగి శుభ్రపర్చి జీవితావసరాలు తీర్చుకున్నవారు, లావెటరీలను ఇతరులతో పంచుకుని, పాడుబడ్డ ఇళ్లలో సాదా సీదా జీవితం గడిపిన వారు, కష్టపడటాన్నే జీవన శైలిగా మార్చుకుని పోరాటంలో ఎదురీదినవారు ఈ రోజు బ్రిటన్ లేబర్ ప్రభుత్వంలో కార్యదర్శి స్థాయి తదితర ఉద్యోగాలు చేస్తూ తొలినాళ్ల నమ్రతను, నిరాడంబరతను విడిచి పెట్టకుండా ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఈ ప్రత్యేక మహిళల మానవీయ గాథను విందామా...
ఎదిగే కొద్దీ ఒదిగి ఉంటే...
పెరిగే కొద్దీ ఒదిగి ఉండటం నేర్చుకోమని పెద్దలంటుంటారు.. అక్షరాలా ఈ సత్యాన్నే తమ జీవితాచరణలో నిరూపించారు ఈ బ్రిటన్ లేబర్ ప్రభుత్వంలో ఉన్న మహిళాధికారులు.. యవ్వనపు తొలినాళ్లలో తమ జీవిత బాధలను మర్చిపోని ఈ ధీమంతులను వారి నమ్రతే ఉన్నత స్థానాల్లో నిలిపింది.
బ్రిటన్ ప్రభుత్వ హోం సెక్రటరీగా పనిచేస్తున్న జాక్వి స్మిత్ చదువుకునే రోజుల్లో ప్రయాణీకుల బోటులో టాయ్‌లెట్లను శుబ్రపర్చే పనిచేసి తనక్కావలసిన వస్తువులు కొనుక్కునేదట. లేబర్ పార్టీకి బ్రిటన్ ప్రజల్లో మద్దతు కూడగట్టేందుకోసం ఒక మహిళా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్వయంగా ఈ విషయాలు చెప్పారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా లేబర్ పార్టీలోని చాలామంది సీనియర్ మహిళా మంత్రులు యువతులుగా ఉన్నప్పుడు నమ్రతతో కూడిన జీవన శైలినే అనుసరించారని ప్రపంచానికి తెలిసింది. తమ జీవితావసరాలు తీర్చుకునేందుకు ఆరోజుల్లో వారు రకరకాల పనులు చేసి బతకడం అలవర్చుకున్నారని స్మిత్‌ను ఇంటర్‌వ్యూ చేసిన టెలిగ్రాఫ్ పత్రిక చెప్పింది.
లేబర్ పార్టీ నేతృత్వంలో పనిచేస్తున్న స్మిత్ ఆమె సహచర ఉద్యోగినుల ద్వారా ఆ పార్టీలోని మానవీయ కోణాన్ని చిత్రించేందుకు టెలిగ్రాఫ్ పత్రిక ప్రయత్నించింది. దీంట్లో భాగంగా తాను చదువుకునే రోజుల్లో సుప్రసిద్ధ గ్లాస్టోన్బరీ ఉత్సవాలకు పోయేందుకు మరియు స్కూల్ రికార్డులను కొనుక్కునేందుకు అవసరమైన డబ్బుకోసం సాధారణ ప్రయాణీకుల బోటులో ఉండే టాయ్‌లెట్‌లను కడిగి శుభ్రపర్చే పనిని చేసినట్లుగా స్మిత్ బయటపెట్టింది.
స్మిత్‌తో పాటు లేబర్ పార్టీలో పేరొందిన మహిళలు టెస్సా జోవెల్, యువెట్టె కూపర్, హారియట్ హార్మన్, రూత్ కెల్లీ, హాజెల్ బ్లియర్స్ మరియు కరోలిన్ ఫ్లింట్ కూడా తమ చిన్నప్పుడు సాదా సీదా జీవనశైలినే అలవర్చుకున్నారు. ఈ సందర్భంగా తమ జీవితావసరాలకు గాను కేబిన్‌లను, టాయ్‌లెట్‌లను కూడా కడిగేదాన్నని స్మిత్ చెప్పుకోగా ఇతరుల అనుభవాలు కూడా అదే రకంగా ఉన్నాయని టెలిగ్రాఫ్ పత్రిక తెలిపింది.
లేబర్ పార్టీ ట్రెజరీ ప్రధాన కార్యదర్శి యువెట్టె కూపర్ తన యవ్వన దినాలను గుర్తు చేసుకుంది. ఆరోజుల్లో వ్యాధి బారిన పడిన తాను పని చేయలేకపోయేదాన్నని చెప్పింది. మూడేళ్ల తర్వాత ఆమె ఎంపీగా ఎన్నికయ్యింది.
సింగిల్ పేరెంట్‌గా జీవించిన లేబర్ పార్టీ హౌసింగ్ మంత్రి కరొలిన్ ఫ్లింట్ మాట్లాడుతూ ఒంటరి మహిళగా తల్లిగా ఉన్నప్పుడు తను చాలా కష్టపడవలసి వచ్చేదని, చివరకు ఫ్లాట్‌ను కూడా స్నేహితులతో కలిసి పంచుకునేదాన్నని చెప్పింది. ప్రస్తుత భర్తతో 1980ల చివరలో కలిసి జీవించటం ప్రారంభించేంతవరకు తనకు ఏ ఆస్తీ ఉండేంది కాదని కరోలిన్ చెప్పారు.
పార్టీ కమ్యూనిటీ కార్యదర్శి హజెల్ బ్లియర్స్ తాను లాయర్‌గా ఉద్యోగానికి వెళ్లినప్పుడు భయంకరమైన అనుభవం ఎదురైందని తెలిపారు. గర్భనిరోధానికి ఏ మాత్ర వాడుతున్నావని ఆమె లాయర్ ముఖమ్మీదే అడిగేయడంతో నోట మాట రాలేదని చెప్పారామె. ప్రసవం దాల్చబోతున్న వారికి ఉద్యోగాలను ఇచ్చేంత శక్తి తమ కంపెనీకి లేదని ఆ సీనియర్ లాయర్ నిస్సంకోచంగా చెప్పడంతో షాక్ తిన్నట్లుగా హజెల్ చెప్పారు.
తన యవ్వనంలో ఎడింబరోలో ఉంటున్నప్పుడు కేవలం 13 షిల్లింగుల ఆరు పెన్నీల ఖరీదు చేసే పాడుపడిన ఫ్లాట్‌లో ఉండేదాన్నని లేబర్ పార్టీ ఒలింపిక్స్ మంత్రి టెస్సా జోవెల్ చెప్పారు. ఆ ఫ్లాట్ బాగా పాడవడమే కాక లావెటరీని కూడా ఇతరులతో పంచుకోవలసి వచ్చేదని చెప్పారామె.