టీవీ రంగంలో అసాధారణ ప్రతిభాశాలి షరీన్..!

Ganesh

బుధవారం, 27 ఆగస్టు 2008 (15:49 IST)
FileFILE
ఆకట్టుకునే అందమైన రూపం, సందర్భానికి తగినట్టుగా వ్యాఖ్యానం, సమయస్ఫూర్తి, చక్కటి భాష, చురుకైన హావభావాలు కలిగిన సక్సెస్‌పుల్ టీవీ జర్నలిస్టు ఎవరని అంటే... షరీన్ ‌భాన్ అని ఠక్కున సమాధానం వస్తుంది. వందలకొద్దీ ఉండే టీవీ న్యూస్ ఛానల్స్‌లో, వేలకొద్దీ ప్రోగ్రామ్స్‌లో, అంతే సంఖ్యలో కనిపించే టీవీ జర్నలిస్టుల్లో ప్రత్యేకంగా ఆకట్టుకోవడం అనేది అంత సాధారణ విషయం కాదు మరి.!
నిజాయితీగా పనిచేసేవారే...!
  ఇరవై నాలుగ్గంటలూ అప్రమత్తంగా ఉంటూ, నిజాయితీగా పనిచేసే వారే ఈ రంగంలో రాణిస్తారని చెప్పే షరీన్ ‌భాన్ ఈనాటి యువతకు ఎంతో ఆదర్శప్రాయంగా నిలిచారు. నిరంతర డెడ్‌లైన్లు, ఒత్తిళ్లు, గంటల తరబడి నిరీక్షణ, రాత్రిళ్లు పొద్దుపోయేదాకా పనిచేయడం లాంటివన్నీ తట్టుకుని..      


ముప్పై ఒక్క సంవత్సరాలకే విజయవంతమైన టీవీ జర్నలిస్టుగా ఎదిగిన షరీన్ భాన్ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఫిలాసఫీ డిగ్రీ పూర్తి చేశారు. అలాగే, పూణే యూనివర్శిటీ నుండి "మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్" (ఎంసిఏ) చేశారు.

సినిమా రంగంలో స్థిరపడాలన్న ఆలోచనలో ఉన్న షరీన్‌కు అనుకోకుండా యూటీవీ నిర్వహించే కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్‌కు ఎంపికయ్యే అవకాశం లభించింది. అక్కడ కరణ్ థాపర్, తవ్లీన్ సింగ్, నఫీసా అలీ లాంటి ప్రముఖుల ప్రోగ్రామ్‌లకు స్క్రిప్ట్, ప్రొడక్షన్‌ పనుల్లో సహాయం చేయడం వల్ల... ఆమె కెరీర్‌నే మలుపు తిప్పేసింది.

ఇక అప్పట్నించీ షరీన్ వెనుదిరిగి చూడలేదు. సాధారణ టీవీ జర్నలిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె ఎన్నో మెట్లు ఎక్కి అసోసియేట్ ఎడిటర్‌గా ఎదిగారు. సిఎన్‌బీసీ టీవీ 18 న్యూస్ ఛానెల్‌లో యంగ్ టర్క్స్, ఇండియా బిజినెస్ అవర్ లాంటి ప్రోగ్రామ్స్‌ను ఈమె నిర్వహించారు.

ఈ ప్రోగ్రామ్స్‌లో భాగంగా షరీన్... బిల్‌గేట్స్, రిచర్డ్ బ్రాన్సన్, దివంగత బేనజీర్ భుట్టో, దీపక్ చోప్రా లాంటి మహామహులను కూడా ఇంటర్వ్యూలు చేశారు. అంతేగాకుండా ఈమె స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. 2005వ సంవత్సరంలో "ఫిక్కీ ఉమెన్ ఆఫ్ ది ఇయర్"గా కూడా ఎంపికయ్యారు.

"దయచేసి ఎవరైనా షరీన్ భాన్ గురించిన వివరాలను చెప్పండి. తాను సీఎన్‌బీసీ ఛానెల్‌ను చూసేదే ఆమె కోసమే" అంటూ ఒక అభిమాని వెబ్‌సైట్‌లో వేడుకోవడం చూస్తే... ఆమె సాధించిన గుర్తింపును మళ్లీ చెప్పనక్కరలేదు. అంతటి ఘనతను సాధించిన షరీన్... సినిమాల తరువాత అంతటి గ్లామర్ కలగలసిన టీవీ రంగంలో రాణించటం అంత మామూలు విషయం కాదంటారు.

నిరంతర డెడ్‌లైన్లు, ఒత్తిళ్లు, గంటల తరబడి నిరీక్షణ, రాత్రిళ్లు పొద్దుపోయేదాకా పనిచేయడం లాంటివన్నీ తట్టుకుని నిలబడాలని, వీటన్నింటికీ సిద్ధపడేవారే ఇలాంటి ఉద్యోగాలను ఎంచుకోవాలని షరీన్ సలహా ఇస్తుంటారు. ప్రతిక్షణం అలర్ట్‌గా ఉంటూ, ఎంత అలసట ఉన్నా... చిరునవ్వుతో కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుందని తన అనుభవాల నేపథ్యంలో చెబుతుంటారు షరీన్.

ఇరవై నాలుగ్గంటలూ అప్రమత్తంగా ఉంటూ, నిజాయితీగా పనిచేసే వారే ఈ రంగంలో రాణిస్తారని చెప్పే షరీన్ ‌భాన్ ఈనాటి యువతకు ఎంతో ఆదర్శప్రాయంగా నిలిచారు. మూడుపదుల వయస్సులో ఇంతటి విజయాన్ని సాధించిన షరీన్ భాన్... తన రంగంలో మరింత అభివృద్ధిని సాధించాలని కోరుకుందాం...!

వెబ్దునియా పై చదవండి