తనకంటే మూడు రెట్లు ఎక్కువ వయస్సు కలిగిన భర్తతో కాపురం చేసేందుకు నిరాకరించడమే గాకుండా, ధైర్యంగా కోర్టుకెక్కి విడాకులు పొందిన బాల వధువు నుజూద్ అలీ (10 సంవత్సరాలు)కి ఉత్తమ మహిళ పురస్కారం లభించింది. ఈ ఏడాది ఉత్తమ మహిళలుగా పురస్కారం పొందిన తొమ్మిదిమందిలోనూ ఒకరిగా అలీ నిలిచింది.
కాగా, ప్రతి సంవత్సరం వినోదం, రాజకీయం, వాణిజ్యం, ఫ్యాషన్, సైన్సు తదితర రంగాల్లోని ప్రముఖ మహిళలకు ఏటా ఉత్తమ మహిళ పురస్కారాలను బహూకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డులను గ్లామర్ మ్యాగజీన్ ప్రకటిస్తుంది. ఈ సంవత్సరం ఉత్తమ మహిళలుగా పురస్కారం అందుకున్న వారిలో హిల్లరీ క్లింటన్, హాలీవుడ్ తార నికోల్ కిడ్‌మన్, అమెరిగా విదేశాంగ శాఖా మంత్రి కండోలిజా రైస్ లాంటి వారు ఉన్నారు.
ఇక నుజూద్ అలీ వివరాల్లోకెళ్తే... యెమెన్‌కు చెందిన నుజూద్‌ను 8 సంవత్సరాల వయస్సున్నప్పుడే 24 సంవత్సరాల వ్యక్తితో బలవంతంగా వివాహం జరిపించారు. ఇష్టం లేని పెళ్లికి ఆమె బలవంతంగా తలవంచినా, నచ్చనివాడితో మనసు చంపుకుని కాపురం మాత్రం చేయలేక పోయింది.
వివాహం జరిగిన రెండు నెలల తరువాత పుట్టింటికి వెళ్లి, ఎవరికీ తెలియకుండా కోర్టుకు వెళ్లింది. విడాకుల కోసం కోర్టుకు వచ్చిన నుజూద్‌ను న్యాయమూర్తి గమనించారు. మానవహక్కుల న్యాయవాది ఒకరు ఆమె తరపున వాదించేందుకు సిద్ధపడ్డారు. ఎట్టకేలకు కోర్టులో కేసు గెలిచి, విడాకులు నుజూద్ విడాకులను పొందింది.
ఇష్టంలేని బంధనాల నుండి విముక్తి రాలైన నుజూద్ ప్రస్తుతం తిరిగీ బడిబాట పట్టింది. విడాకులు ఆ బాలికలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయని పై మేగజైన్ వివరించింది. విడాకులు తీసుకోవడంతో తనకు కొత్త బలం వచ్చిందని, తన ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయని, జీవితం తియ్యటి చాక్లెట్ లాగా మారిందని అమాయకంగా నవ్వులు చిందిస్తూ చెబుతోంది మన చిన్నారి నుజూద్. ఆమె జీవితం కలకాలం చల్లగా ఉండాలని కోరుకుందాం.!