'ముదితల్ నేర్వగరాని విద్య గలదై ముద్దార నేర్పింపగన్' అనే పద్య సారాంశాన్ని హిమాచల్ ప్రదేశ్ మహిళలు నిరూపిస్తున్నారు. గుజరాత్‌లో ఆనంద్ పాల సహకార సంస్థ ఆ ప్రాంత రైతుల జీవితాలలో పెనుమార్పులు తీసుకువచ్చిన చరిత్రను హిమాచల్ ప్రదేశ్ మహిళలు పునర్లిఖిస్తున్నారు.
భారతీయ మహిళా ప్రపంచంలో సెలబ్రిటీలు, తారలు, మోడల్స్ వంటి ఆధునిక మహిళలే కాకుండా అతి సాధారణ గ్రామీణ మహిళలు సైతం అవకాశం లభిస్తే తమ ప్రత్యేకతలను చాటుకుంటున్న వైనానికి హిమాచల్ మహిళల పాల సహకార సంస్థ తిరుగులేని ఉదాహరణగా నిలుస్తోంది. వ్యక్తులుగా కాకుండా సమూహంగా ఈ రాష్ట్రంలోని గ్రామీణ మహిళలు తిరగరాసిన చరిత్రను చూద్దామా....
హిమాచల్‌ప్రదేశ్‌లోని సిర్మోర్ జిల్లాలోని సరహాన్ గ్రామంలో ఉన్న ఇందిరా మహిళా పాల ఉత్పత్తి సహకార సంస్థ పాల ఉత్పత్తిలో నూతన రికార్డును సృష్టించింది. సిర్మోర్ జిల్లాలో పాల ఉత్పత్తికి సంబంధించి ఈ సంస్థ ప్రథమస్థానాన్ని సాధించింది.
హిమాచల్ ప్రదేశ్ పాల ఉత్పత్తి సమాఖ్య ఈ ఇందిరా మహిళా పాల ఉత్పత్తి సహకార సంస్థను ప్రథమశ్రేణి సంస్థగా గుర్తించింది. ఈ కేంద్రం ఉత్పత్తి చేస్తున్న పాల పరిమాణం, నాణ్యతను దృష్టిలో పెట్టుకుని దీనికి అగ్రశ్రేణి కల్పించాలని సమాఖ్య నిర్ణయించింది. సిర్మోర్ జిల్లాకు చెందిన వెయ్యిమంది మహిళలు ఈ గ్రామంలో 13 మహిళా సమితుల కింద చేరి పాల ఉత్పత్తిలో నిమగ్నమయ్యారు.
సిర్మోర్ జిల్లాలో పాల ఉత్పత్తిలో 55 నమోదైన, నమోదు కాని పాల సొసైటీలు ఉన్నాయి. ఈ జిల్లా పాల సమాఖ్య సగటున రోజుకు 6,800 లీటర్ల పాలను ఉత్పత్తి చేస్తుంటుంది. ఈ సంవత్సరం సమాఖ్య రోజుకు 10 వేల లీటర్ల పాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
పాల ఉత్పత్తిలో సాధించిన ఈ కొత్త రికార్డుతో ఈ ప్రాంతంలోని మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు ఆదాయాన్ని వీరు కళ్లజూస్తున్నారు. ఈ సొసైటీ 1998లో నమోదైంది. అప్పటినుంచి వీళ్లకు నిలకడగా ఆదాయం వస్తోంది. ఇది వీరి జీవితాలను మెరుగుపరుస్తోంది కూడా.
ఈ సొసైటీలో పనిచేస్తున్న గ్రామీణ మహిళ గీతాదేవి తన పాల సహకార సంస్థ చరిత్రను ఇలా వివరించారు. "మా కాళ్ల మీద మేం నిలబడాలని అనుకున్నా. ఈ లక్ష్యంతోటే ఈ పాల సొసైటీని ప్రారంభించాము. దీనితో మాకంటూ రోజూ ఓ ఆదాయ వనరు ఏర్పడింది. 1993లో ప్రారంభించబడిన మా సొసైటీ నాలుగేళ్ల తర్వాత నమోదైంది. ఇప్పుడు మేం ప్రతిరోజూ 150 లీటర్ల పాలను అమ్ముతున్నాం. రుతుపవనాల కాలంలో 250 లీటర్లు కూడా అమ్మగలుగుతున్నాం. ఒక్కోసారి లీటరు పాల ధరను రూ14లకు కూడా అమ్ముతుంటాం కాని సగటున లీటరు రేటు రూ10లుగా ఉంటోంది"
ఈ జిల్లాలోని పురుషులు తమ మహిళలకు బాగానే మద్దతు ఇస్తుంటారు. దీనివల్ల ఇలాంటి పాల సొసైటీల్లో మరింతమంది మహిళలు చేరేందుకు ప్రోత్సాహం లభిస్తుంది. దీనిద్వారా మహిళలను తమ కుటుంబ ఖర్చులకు చేదోడు వాదోడుగా కూడా ఉంటున్నారు.
కాగా హిమాచల్ ప్రదేశ్‌లోని కుల్లు, మాండి తర్వాత పాల ఉత్పత్తికి సంబంధించి సిర్మోర్ మూడో స్థానంలో ఉంది. ఈ పాల సమాఖ్య డైరెక్టర్ మాట్లాడుతూ 1994 నుంచి తాము పాల ఉత్పత్తిని చేపడుతున్నామని చెప్పారు. సరహాన్ గ్రామ మహిళా సమితి పాల ఉత్పత్తిలో ప్రధమస్థానంలో నిలిచిందని సగర్వంగా తెలిపారు.