వాళ్లు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన మేనేజ్‌మెంట్ స్కూల్ నుంచి వచ్చిన చురుకైన పట్టభద్రులు కాకపోవచ్చు. కాని వ్యాపారవేత్తలు కావాలని వారు కల కన్నారు. తొలిదశగా పంజాబ్‌లోని అమృత్‌సర్ పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలోని గ్రామంలో మహిళా క్లబ్‌ను ఏర్పర్చుకున్నారు.
రోజువారీ పనులను ముగించుకున్నాక ఈ గృహిణులు వివిధ ఉత్పత్తుల తయారీకై సమావేశమయ్యారు. పర్కాష్ మరియు అమాన్ అనే రెండు విడి గ్రూపులుగా పనిచేసిన ఈ మహిళలు తమ నైపుణ్యాలను పెంచుకుని తాము తయారుచేసిన వివిధ సాంప్రదాయిక గృహోత్పత్తులకు మార్కెట్‌ను సృష్టించుకున్నారు. తరతరాలుగా తమ కుటుంబజీవితం భాగంగా ఉన్న ఈ ఉత్పత్తులను వారు ఎన్నడూ వ్యాపారపరంగా బయట అమ్మిందిలేదు.
హోమ్ సైన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని అయిన ప్రేమ్‌జీత్ కౌర్ మాటల్లో చెప్పాలంటే తన ప్రాంతంలోని మహిళా క్లబ్ గొప్ప వరాన్ని ప్రసాదించిందట. పల్లెటూరిలో నివసిస్తున్నప్పటికీ తాను కూడా వ్యాపారవేత్త కాగల అవకాశాన్ని ఈ క్లబ్ ఇచ్చిందని ఆమె సంబరంగా చెబుతుంది. కేవలం కుటుంబ ఆదాయాన్ని పెంచడమే కాదు తన పనితో మొత్తం కుటుంబానికే పేరు తెచ్చింది.
వీరిలో ప్రతి గ్రూపులో 15 మంది సభ్యులు ఉన్నారు. రూ100లు కడితే ఈ గ్రూపులో చేరవచ్చు. ప్రతినెలా వంద రూపాయలు కట్టాలని నిబంధన. ఇలా సమకూరిన మొత్తంనుంచి వీళ్లు రుణాలు తీసుకోవచ్చు.
ఈ గ్రామీణ మహిళలు పర్యావరణ అనుకూల బ్యాగులు, డిజైనర్ లేడీస్ సూట్లు, మిర్రర్ వర్క్, బొమ్మలు, తేలికపాటి బొమ్మలు, అలంకరణ వస్తువులు, హ్యాండిక్రాఫ్ట్, పచ్చళ్లు, అప్పడాలు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ వంటివి తయారు చేస్తున్నారు. వీరిలో ప్రతి మహిళా నెలకు కనీసం రూ1500లు సంపాదిస్తుండడం విశేషం.
నెల చివర్లో సభ్యులందరూ క్లబ్‌లో తాము తయారు చేసిన వస్తువులను చూపించాలి. వాటి నాణ్యతను బట్టి క్లబ్ ధరలను నిర్ణయిస్తుంది. తర్వాత ఈ వస్తువులు అమ్మకానికై షాపులకు పంపించబడతాయి.
ఇది మా స్వప్నాన్ని ఫలింపజేసుకున్నట్లే అని రాజేందర్ కౌర్ అంటుంది. క్లబ్ సహాయంతో ఈమె పూల అమరికను నేర్చుకుంది. ఆమె తన తయారీలను అమ్ముకునే స్థాయికి వచ్చింది. ఇది ఆమె చైతన్యాన్ని మెరుగు పర్చడమే కాదు, తన ఆత్మగౌరవాన్ని కూడా పెంచింది మరి.
అయితే మార్కెటింగ్ నైపుణ్యాలను నేర్చుకున్న తర్వాత వృత్తిపరంగా మహిళలను మరింతగా తీర్చిదిద్దేందుకు గాను ప్రభుత్వం గ్రామాల్లో క్యాంపులను ఏర్పరిస్తే బాగుంటుందని రాజేందర్ కౌర్ అభిప్రాయం. అలాగే తమ ఉత్పత్తులను ఎగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం తమకు సాయపడాలని కూడా వీరు ఆశిస్తున్నారు.
కాగా, గత అయిదేళ్లుగా ఈ మహిళా క్లబ్ పనితీరుతో క్లబ్ సభ్యులందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని క్లబ్ అధ్యక్షురాలు కులదీప్ కౌర్ గర్వంగా ప్రకటించారు. ఇప్పుడు బ్యాంకులు సైతం వీరికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాయని కౌర్ ప్రకటించారు.
పెద్ద పెద్ద కంపెనీలు తమకు ముడిసరకులను అందించాలని వీరు కోరుతున్నారు. మంచి ఆదాయం సంపాదించేందుకై తాము శక్తిమేరా కృషిచేస్తామని కౌర్ చెప్పారు.
నిజంగా వీరు ప్రత్యేక తరహా మహిళా వ్యాపారవేత్తలే మరి. కాదంటారా...