సామాజిక న్యాయం కోసం ఎలుగెత్తిన మహాశ్వేతాదేవి

Raju

గురువారం, 11 సెప్టెంబరు 2008 (19:37 IST)
FileFILE
ఉద్యోగిగా, రచయితగా ద్విపాత్రాభినయం చేస్తూనే సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన అరుదైన భారతీయ రచయిత్రి మహాశ్వేతాదేవి. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం వల్ల ఎదురయ్యే సమస్యలను గొంతెత్తి చాటడమే కాక వ్యవసాయ భూములను పరిశ్రమలకు కేటాయించడాన్ని నిరసిస్తూ ఉద్యమిస్తున్న ఈ అరుదైన రచయిత్రికి లభించిన పురస్కారాలు తక్కువైనవేం కావు.

ఆమె రాసిన హజారీ చౌరాసిమా నవల -ఒకతల్లి- మూడు దశాబ్దాల క్రితం భారతీయ సాహిత్య ప్రపంచంలో సంచలనం రేకెత్తించింది. 1960ల చివర్లో పశ్చిమబెంగాల్‌లో యువతరాన్ని ఉర్రూతలూగించిన నక్సలైట్ ఉద్యమంలో కన్నకొడుకు పాలుపంచుకుని సమిధలాగా ఆహుతైన తర్వాత, అతడా నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణమైన కౌటుంబిక సామాజిక మూలాలను వెతుక్కుంటూ వెళ్లి, అతడు ఎందుకామార్గం ఎంచుకున్నాడో తెలిసి గుండె పగిలిన మాతృమూర్తి హృదయ నివేదనను ఈ నవలలో మహాశ్వేతాదేవి చిరస్మరణీయమైన రీతిలో రచించారు.
ఒకతల్లి.. మాతృనివేదన..
  నక్సలైట్ ఉద్యమంలో కన్నకొడుకు పాలుపంచుకుని బలైనప్పుడు అతడా నిర్ణయం తీసుకునేందుకు కారణమైన సామాజిక మూలం వెతుక్కుంటూ వెళ్లి, ఆమార్గం ఎందుకు ఎంచుకున్నాడో తెలిసి గుండె పగిలిన మాతృమూర్తి హృదయ నివేదనను ఒక తల్లి నవలలో మహాశ్వేతాదేవి చిరస్మరణీయ రీతిలో రచించారు      


వెనుకబడిన జాతుల తెగల జీవన సమస్యలను, చరిత్రకెక్కిస్తూ ఆమె రాసిన నవలలు ప్రసిద్ధి కెక్కాయి. ఆమె రచనల్లో హజారీ చౌరాసిమా 1975, అరణ్యేర్ అధికార్ 1977, అగ్నిగర్భ 1978, చోటీ ముండా ఎవాం తార్ తీర్ 1980, ధౌలి, రుడాలి, ఎక్ కోరీస్ డ్రీమ్ వంటివి దేశవ్యాప్తంగా పలు భాషల్లోకి అనువదించబడ్డాయి. శాంతి నికేతన్‌ను వ్యాపారీకరించే విధానానికి ఆమె మద్దతు పలికారు. రవీంద్రనాథ్ టాగూర్ స్థాపించిన ఈ విద్యాసంస్థలో ఆమె గతంలో చాలా కాలం గడిపారు.

సింగూర్ మరియు నందిగామ్ ప్రాంతాల్లో వివాదాస్పద భూ సేకరణ, అమలు విధానానికి వ్యతిరేకంగా ఆమె ఎందరో మేధావులను, కళాకారులను, రచయితలను. రంగస్థల నటులను కూడగట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో గుజరాత్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ఇటీవల కొనియాడి సంచలనం రేపిన మహాశ్వేతాదేవి, అదే సమయంలో 30 సంవత్సరాల వామపక్ష పాలన పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి ఒరగబెట్టిందేమీ లేదని దుయ్యబట్టారు.

మహాశ్వేతాదేవి చేసిన సాహిత్య సామాజిక సేవలకు గాను అత్యున్నత అవార్డులెన్నో ఆమెను వరించాయి. భారత ప్రభుత్వ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ 2006లో ఆమెను వరిచింది. జర్నలిజం, సాహిత్యం, సృజనాత్మక వ్యక్తీకరణలకు గాను 1997లో ఆమెకు ఆసియా ఖండ నోబెల్‌గా పేరొందిన ప్రతిష్ఠాత్మక రామన్ మెగాసెస్ అవార్డు లభించింది. ఇక సాహిత్య అకాడమీ అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ్ అవార్డును 1996లోనే ఆమె చేజిక్కించుకుంది.

1926లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో పుట్టిన మహాశ్వేతాదేవి దేశ విభజన సమయంలో కుటుంబంతో సహా భారత్ వచ్చి పశ్చిమబెంగాల్‌లో స్థిరపడ్డారు. తల్లి, తండ్రి, అన్న ఇలా అందరూ సాహితీవేత్తలే అయిన కుటుంబంలో మహాశ్వేతాదేవి పెరిగారు. తండ్రి మనీష్ ఘటక్ కవి, నవలా రచయిత కాగా, తల్లి ధరిత్రీదేవి సామాజిక కార్యకర్త, రచయిత. ఇక ఆమె సోదరుడు రిత్విక్ ఘటక్ సినిమా దర్శకుడు అని అందరికీ తెలిసిన విషయమే.

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో బాల్యం గడిపిన ఆమె బెంగాల్ వచ్చిన తర్వాత స్కూలు చదువు, గ్రాడ్యుయేషన్ విశ్వకవి రవీంద్రుడు స్థాపించిన శాంతి నికేతన్ విద్యాసంస్థలోని విశ్వభారతి స్కూల్‌లో జరిగింది. కలకత్తా యూనివర్శిటీలో ఎంఏ పూర్తిచేసిన మహాశ్వేతాదేవి ప్రసిద్ధ బెంగాలీ నాటక రచయిత, నటుడు బిజోన్ భట్టాచార్యను వివాహమాడారు.

1964లో బిజోయ్‌ఘర్‌ కాలేజీలో లెక్చరర్‌గా చేరడంతో ఆమె కెరీక్ మొదలైంది. లెక్చరర్‌గా చేస్తూనే జర్నలిస్టుగా పనిచేసిన ఆమె బెంగాలీ రచనల్లో అప్పటి వరకు ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. సామాజిక దృక్పధంతో, సమకాలీన సమాజ పరిస్థితులకు అద్దం పడుతూ, సమాజాభివృద్ధికి మార్గదర్శనం చేస్తూ సాగే ఆమె రచనలు విశేషంగా అమ్ముడుపోవడం విశేషం. గిరిజనుల జీవన విధానం, ఈశాన్య భారతంలోని భూమిలేని వ్యవసాయ కూలీల జీవన స్థితిని ప్రతిబింబిస్తూ రాసిన ఆమె రచనలను సామాజిక పరిశోధనా గ్రంధాలుగా పరిగణిస్తుంటారు.

వెబ్దునియా పై చదవండి