జాన్ ట్రవోల్టా, వేన్ స్లీప్ వంటి హాలీవుడ్ విశిష్ట వ్యక్తులతో బ్రిటిష్ యువరాణి దివంగత డయానా డ్యాన్స్ చేసి ప్రపంచాన్ని ఊగించి ఉండవచ్చేమో గానీ, యుక్తవయస్సులో మాత్రం తాను ఏనుగులా డ్యాన్స్ చేసి ఉంటానని నిర్భీతిగా చెప్పుకున్నారు.
పదిహేడు సంవత్సరాల వయస్సులో తన మాజీ దాదికి రాసిన ఉత్తరంలో డయానా ఈ విషయాన్ని పంచుకున్నారు. చిన్నప్పటి నా డ్యాన్స్ చూడటం అంటే ఏనుగును చూసినట్లు ఉండేదని డయానా ఈ లేఖలో తనపై తానే చెణుకు విసురుకున్నారు.
యువరాణి డయానా....
సాధారణ కుటుంబంలో పుట్టి జగత్ప్రసిద్ధి పొందిన బ్రిటిష్ రాజకుటుంబంలో యువరాణిగా అడుగుపెట్టిన డయానా సౌకుమార్యం, సున్నితత్వం, భావో్ద్వేగం వంటి సేవాభావం వంటి విశిష్ట లక్షణాల కలబోత. జీవితానికి మరణానికి మధ్య నిలిచిన అపరూప వ్యక్తిత్వం ఆమె సొంతం...
తన దాది మేరీ క్లార్క్‌కు డయానా రాసిన నాలుగు ఉత్తరాల్లో ఇదీ ఒకటి. ఇవి ఇంతవరకు ఎక్కడా బయటపడలేదు. కాగా, సెప్టెంబర్ 30వ తేదీన ఈ ఉత్తరాన్ని బ్రిటన్‌లోని కొల్చెస్టర్‌లో వేలం వేయనున్నారు. దీనికి పది వేల పౌండ్లు పలకవచ్చని భావిస్తున్నారు.
తన దాది మేరీ క్లార్క్‌కు రాసిన లేఖలో తన కాబోయే భర్త ప్రిన్స్ చార్లెస్, పెళ్లి చేసుకోవాలని తాము ప్రతిపాదించుకున్నప్పుడు తను పొందిన ఉద్వేగం, తొలిసారిగా ప్రిన్స్ విల్స్‌కు జన్మ ఇచ్చినప్పుడు తన అనుభూతుల గురించి డయానా రాశారు. పెళ్లయిన ఆరు నెలల తర్వాత చార్లెస్ పట్ల తను పెంచుకున్న అనురాగం వంటి వాటి గురించి ఆ లేఖలో డయానా పొందుపర్చారు.
పెళ్లి చేసుకోవడం, తన సమయాన్ని మరొకరికి అంకితం చేయడం అనేవి తననెంతగానో కదిలిస్తున్నాయని ఆ లేఖలో డయానా రాశారు. యుక్తవయసులో బ్రిటిష్ యువరాణికి దాదిగా పనిచేసిన 58 ఏళ్ల నానీ మేరీ క్లార్క్ మాట్లాడుతూ డయానా ఒక అద్భుతమైన వ్యక్తిగా వర్ణించారు.
అయితే ఎల్లవేళలా ఆమెలో ఆత్మ విశ్వాసాన్ని పెంచవలసి వచ్చేదని ఆమె చెప్పారు. అసంఖ్యాక ప్రజలు తనను ప్రేమించారంటే ఆమె ఎన్నటికీ నమ్మేది కాదని దాది చెప్పారు.
తన డ్యాన్స్ ఏనుగు డ్యాన్స్‌లా వికారంగా ఉంటుందని తనమీద తానే జోకులు వేసుకోవడంలో కూడా డయానా పరిణిత వ్యక్తిత్వమే కనిపిస్తుంది.