తృణమూల్ అధినేత మమతా బెనర్జీ

Pavan Kumar

మంగళవారం, 27 మే 2008 (20:20 IST)
పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలను ఎదురొడ్డి పోరాడుతున్న నేత తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ. నందిగ్రామ్ విషయంలో స్థానికుల తరపున పోరాడిన నేత మమత. వామపక్షాలకు బెంగాల్‌లో కొరుకుడు పడని నేత మమత. మమతా బెనర్జీ 1995 జనవరి 5వ తేదీన కోల్‌కతాలో జన్మించారు. మమతా 15 ఏళ్ల ప్రాయంలోనే కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితురాలై పార్టీ కోసం పనిచేశారు.

కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్‌బీ డిగ్రీని అందుకున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురైన సమయంలో 1984లో జాదవ్‌పూర్ నుంచి పోటీచేసి అతిపిన్న వయసులో పార్లమెంట్ సభ్యురాలయ్యారు. వామపక్ష ధిగ్గజం సోమనాథ్ ఛటర్జీని ఓడించి మమతా రికార్డు సృష్టించారు. 1989లో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీచడంతో మమతా పరాజయం పాలయ్యారు.

మమతా బెనర్జీ 1991 నుంచి కోల్‌కతా దక్షిణ స్థానం నుంచి ఇప్పటివరకూ పోటీచేసి నిరంతరాయంగా విజయాలు సాధిస్తూనే ఉన్నారు. మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు మంత్రివర్గంలో మానవ వనరుల అభివృద్ధి, యువజన వ్యవహారాలు, క్రీడలు, మహిళాశిశు అభివృద్ధి వంటి శాఖలకు సహాయ మంత్రిగా పనిచేశారు. పీవీ మంత్రివర్గంలో ఉంటూనే కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడిన చరిత్ర మమతాది.

మమతా బెనర్జీ 1997లో కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిపోయి కొత్త పార్టీ ఏర్పాటుకు యత్నాలు ఆరంభించారు. 1998లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని మమతా ఏర్పాటుచేసింది. భాజపాతో జట్టు కట్టి ఎన్‌డీఏ కూటమి తరపున పోటీచేసి తృణమూల్ మెరుగైన సీట్లు సాధించింది.

2000లో రైల్వే శాఖ మంత్రిగా మమతా బాధ్యతలు చేపట్టిన తర్వాత బెంగాల్‌కు కావలసిన వాటిపై దృష్టిపెట్టి వివాదాస్పదురాలయ్యారు. భారతీయ రైల్వే అభివృద్ధికి అవసరమైన చర్యలను మమతా చేపట్టారు. 2001 పశ్చిమ బెంగాల్ శాససనభ ఎన్నికలపుడు ఎన్డీఏ కూటమిని విడిచిపెట్టి కాంగ్రెస్‌తో జట్టు కట్టి పోరాడారు. అయితే తృణమూల్‌కు ఓటమి ఎదురుకావడంతో 2004లో తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరారు. పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో జయభేరి మోగించటానికి మమతా సన్నాహాలు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి