పైలట్ కావాలని కన్న కలలు నిజమైతే...

బుధవారం, 16 జులై 2008 (16:37 IST)
ప్రతి ఒక్కరు ఏదో ఒక లక్ష్యం దిశగా అడుగులు వేయడం సహజం. ఆ విధంగా ఎన్నో కలలు కనడం కూడా అత్యంత సహజంగా జరుగుతుంటుంది. అలాంటప్పుడు కన్న కలలు నిజమైతే.. అందులో ఉన్న ఆనందాన్ని.... తృప్తిని చెప్పడం సాధ్యం కాదేమో. ఉన్నత లక్ష్యాలను చేరుకునేందుకు... అవలంబించిన మార్గంలోని అవాంతరాలను అధిగమించి గమ్యాన్ని చేరుకున్నామన్న ఆత్మసంతృప్తిని వర్ణించడానికి భాషలోని పదాలను వెతుక్కోకా తప్పదు.

సరిగ్గా అలాంటి పరిస్థితే ఆదిలాబాద్ జిల్లా సమీపంలోని ఖానాపూర్ మండలం ఎలగడప గ్రామానికి చెందిన స్వాతికి వచ్చింది. పుట్టింది మారుమూల గ్రామంలోనైనా... మధ్యతరగతి కుటుంబమైనా తన తండ్రి లక్ష్యాన్ని తనదిగా చేసుకుని... అందుకోసం ఎన్నో అవాంతరాలను అధిగమించి పైలెట్ అయ్యింది. వాస్తవానికి ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మహిళ పైలెట్ అవ్వడం నమ్మశక్యంగా లేకున్నా... సంచలనాలకు ఆలవాలమైన ఈ ప్రపంచంలో మహిళ కూడా మినహాయింపు కాదు అన్న సత్యాన్ని స్వాతి నిజం చేసింది.

స్వాతి తండ్రి పేరు గంట మురళి.... ఓ పోలీసు కానిస్టేబుల్‌. ఆయనకున్న ముగ్గురు సంతానంలో స్వాతి రెండో బిడ్డ కాగా... అన్నా, చెల్లెలు ఉన్నారు. ఆదిలాబాద్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం లక్ష్యం కోసం ఆమె శ్రమించడం మొదలెట్టింది. ఎంత మంది వారిస్తున్నా, నిరుత్సాహపరిచినా... బ్యాంకులో రుణం తీసుకుంది. అమ్మా, నాన్నల సహకారంతో ఆత్మవిశ్వాసం ఆలంబనగా చేసుకుని అకుంఠిత దీక్షతో పైలెట్ ప్రవేశ రాత పరీక్షలకు హాజరయ్యింది.

ఆ పరీక్షల్లో నెగ్గిన వారు సుమారు 25మందికి పైగా ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అందులోను స్వాతి అనూహ్యంగా ఎంపికయ్యింది. వారిలోను ముగ్గురికి మాత్రమే పైలెట్ అర్హత పొందగా... ఉద్యోగం మాత్రం స్వాతినే వరించడం విశేషం. అలా అర్హత పొందిన స్వాతి ఫిలిప్పీన్స్‌లో, అమెరికాలో శిక్షణ పొంది ప్రాథమిక దశలో 200గంటల ఫ్లయింగ్‌ను పూర్తి చేసుకుంది.

అయితే వివిధ రకాల విమానాలను నడిపిన స్వాతి, తొలిసారి విమానం ఎక్కేప్పుడు మాత్రం భయంతో పాటు వెంటనే అమ్మా, నాన్నలు గుర్తుకు వచ్చారంటూ ఆనందం విరిసిన కళ్లతో చెప్పింది. అలాగే విమానం ఒక్కసారిగా గగనతల ప్రయాణం ప్రారంభించాక తొలిసారి ఆ అనుభవం తానిప్పటికీ మరచిపోలేనని చిరునవ్వు చిందించింది.

ఉన్నత లక్ష్యం దిశగా వెళుతున్న వారికి అవాంతరాలు ఎక్కువగా ఉంటాయని... అధైర్యపడక... ఓర్పుతో వాటికి తట్టుకుని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని ఆమె ధీమాగా వెల్లడిస్తోంది.

వెబ్దునియా పై చదవండి