పత్రికల్లో, టీవీల్లో, ప్రసార మాధ్యమాల్లో ఎక్కడ చూసినా మహిళలు అంటే మనకు వెంటనే గుర్తుకొచ్చేదీ.. పనికట్టుకుని మీడియా మనకు చూపించేదీ ఎవరినో అందరికీ తెలుసు. తారలు, మోడల్ గర్ల్స్, ఆధునిక రంగాల్లో కాలుపెట్టి పురుషులతో పాటు దూసుకు పోతున్న నవ నాగరిక మహిళలు... నిత్యం మనం చూసేది.. మనకు చూపించేది, మనను వెంటాడేది ఈ బాపతు నాజూకు మహిళా సంకేతాలే అంటే ఎవరూ సందేహించక పోవచ్చు.
కానీ... గత కొన్ని దశాబ్దాలుగా పురుషుల దుర్గమ దుర్గాలను బద్దలు కొడుతూ విజయ పథంలో దూసుకు పోతున్న ఇలాంటి మహిళలే కాదు... ఈ ప్రపంచంలో వీరికి భిన్నమైన మహిళలు ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఆధునిక జీవిత ఫలాలను ఈ నాటికీ అందుకోలేని వారు... దేన్నయితే నాగరికత అంటూ ప్రపంచం టముకు వాయిస్తోందో ఆ నాగరికత అంచులను కూడా చూడలేని వారు. అతి సామాన్యులు, చదువు రానివారు. చేతి పనులు చేసుకోవడం తప్ప కంప్యూటర్లను టకటకలాడించలేని వారు, వ్యావసాయిక జీవిత విధానాన్నుంచి అణుమాత్రం బయటకు రాలేని వారు.. దేవుడు చల్లగా చూస్తే చాలు ఎలాగోలా బతికేస్తాం అంటున్న అల్పసంతోషులు...
వీళ్లూ మహిళలే...
నిజంగానే ఉన్నారు... ఇలాంటి సామాన్య, అతి సాధారణ మహిళలూ ఈ ప్రపంచంలో ఉన్నారు.... తమ జీవితాలను హారతి కర్పూరంలా కరిగించి పిల్లల బాగు కోసం. విద్యాబుద్ధుల కోసం, మంచి బతుకు కోసం కలలు కనే ఈ తరహా మహిళలూ ప్రపంచంలో ఉన్నారు..
ఉన్నారు... ఈ లోకంలో ఇలాంటి వాళ్లూ ఉన్నారు. ప్రపంచం ఎటు పోతోందో, ఎన్నెన్ని నవ్య వినూత్న రీతుల్లో సమాజ గమనం దూసుకుపోతోందో తెలియనివారు.. పూలమ్ముకని బతికేవారు, అప్పడాలు చేసుకుని బతికే వారు, చేతి చలవతో పచ్చళ్లకు నవరసాలను అంటించి జనాలను మెప్పించడం ద్వారా కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు... చదువు లేకపోతే బతకలేమా అంటూ మేరు నగ ధీరత్వాన్ని ప్రపంచం ముందు పరిచేవారు... కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తూ కనుమరుగైపోతే కొండంత ధీమా అండగా కుటుంబ భారాన్ని మోస్తున్నవారు...
ఉన్నారు... ఇలాంటి సామాన్య, అతి సాధారణ మహిళలూ ఈ ప్రపంచంలో ఉన్నారు.... తమ జీవితాలను హారతి కర్పూరంలా కరిగించి పిల్లల బాగు కోసం. విద్యాబుద్ధుల కోసం, మంచి బతుకు కోసం కలలు కనే ఈ తరహా మహిళలూ ప్రపంచంలో ఉన్నారు.. దేశాన్ని, జాతిసంపదలను ముందుకు తీసుకెళుతున్న వారు, తాము చదువుకొనలేకపోయినా చదువులే పిల్లలకు శ్రీరామరక్ష అనే ఆధునిక జీవన సారాన్ని గ్రహించి, అష్టకష్టాలనూ భరించి వారికి చదువును ప్రసాదిస్తున్న వారు... తాము కన్న కలలను తమ పిల్లల ద్వారా సాఫల్యం చేసుకుంటున్నవారు....
ఇలాంటి మహిళలూ ప్రపంచంలో ఉన్నారు... వీళ్లు శ్రామిక వర్గ మహిళలు కావచ్చు... దిగువ మధ్యతరగతి మహిళలు కావచ్చు... ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్న చోదక శక్తుల్లో వీరి పాత్ర తక్కువేమీ కాదు కాబట్టే వీరిని కూడా తమదైన జీవనరీతిలో ప్రత్యేక మహిళలుగా మనం పిలవవచ్చు... ఓటు వేసిరావడం తప్ప రాజకీయాలతో సంబంధం లేనివారు, చంద్రమండల యాత్రల గురించి పెద్దగా ఆలోచించలేనివారు... అతి సాధారణ సగటు జీవితం గడుపుతున్న నిరాడంబర మహిళలు, తమ తమ చిన్ని చిన్ని ప్రత్యేకతలతో ఈ ప్రపంచ సౌధానికి పునాదిరాళ్లను పేర్చుకుంటూ వస్తున్నవారు..
కాస్సేపు మిరుమిట్లు గొలిపే నవయవ్వన కాంతలను, అందాల ఆరబోతలను, టూరిజం తప్ప ఏ ఇజమూ లేకుండా పోతున్న దౌర్బాగ్యపు ప్రపంచంలో మోడల్ గర్ల్స్ మెరుపులను, తారల సయ్యాటలను, జగదేకసుందరిలను, గగనవిహారంలో మేఘాల అంచులను ముద్దాడుతూ దూసుకుపోతున్న విమానవతులను, నిద్రలేచి పేపర్ ముఖం చూస్తే తళుక్కుమనే తటిల్లతలను.. కాస్సేపు పక్కన బెట్టి... మన ఇంటి అమ్మలను, మనదైన శ్రమసంస్కృతి పట్టుగొమ్మలను కాసేపు పలకరిద్దామా...
ఇలాంటి అమ్మలను, అమ్మలగన్న అమ్మలను, పల్లెనుంచి పట్నందాకా తమ శ్రామిక సంస్కృతీ వారసత్వాన్ని ప్రపంచం ముందు పరుచుకుంటూ వస్తున్న మన ఇంటి తల్లులను వ్యక్తిగత పరిచయాల రూపంలో అయినా చూడటానికి మనసు పెడితే బాగుంటుందనే ప్రేరణను కలిగించిన ఒక అమ్మను మనం ఈ వారం పలకరిద్దామా...
జీవితాన్ని రంగుల కళ్లద్దాల్లోంచి చూడటం కాస్సేపు పక్కనబెట్టి మనకు సమీపంలోనే ఉంటూ శ్రమ సంస్కృతిని చుక్కల్లా మెరిపిస్తున్న సగటు మహిళల్లో ఓ అమ్మ గురించి ఈ వారం ప్రత్యేక మహిళల శీర్షికలో మాట్లాడుకుందామా? అయితే రేపటి వరకు వేచి ఉండండి... ఖమ్మం జిల్లా జాస్తి పల్లె నుంచి కేరళలోని త్రివేండ్రం దాకా జీవితం చూపిన బాటలో పయనించిన మన తెలుగు మహిళను పరిచయం చేసుకుందాం మరి..