ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తు, పల్లాలు అనేవి సహజం. వాటిని తట్టుకోగలిగినప్పుడే విజయం మన సొంతం అవుతుందని మౌనిక నిరూపించింది. చిన్న తనంలో తండ్రి దూరమైనా, భరత నాట్యం నేర్చుకోవాలన్న తపన మాత్రం ఆమె నుంచి పోలేదు. ఆ తపనే మౌనికను నృత్య కళాకారిణిగా తీర్చిదిద్దింది.
మహబూబ్‌నగర్ జిల్లాలో ఎదిరి పల్లి గ్రామంలో ఒ సాదాసీదా కుటుంబంలో జన్మించిన మౌనిక చిన్న తనం నుంచే నృత్య కళను అమితంగా ఇష్టపడేది. ఈ విషయాన్ని గమనించిన ఆమె తల్లి ఇందిరమ్మ ఆదిలో వారించినా.. ఆ తర్వాత మౌనికకు నృత్యం పట్ల ఉన్న ఆసక్తిని కాదనలేకపోయింది.
తల్లి ప్రోత్సాహంతో బుల్లితెరలో ప్రసారమయ్యే నృత్య కళలను తిలకిస్తూ ఏకలవ్యుని తరహాలో విద్యనభ్యసించింది. ఎట్టకేలకు నేర్చుకున్నా.. ఆమెకు ప్రదర్శనలు ఇచ్చే అవకాశాలు మాత్రం రాలేదు...
అయినా తనలోని ఆత్మవిశ్వాసాన్ని వదులుకోక తన ప్రతిభకు మరింత వన్నె తెచ్చే దిశగా ప్రయత్నించింది. ఈ తరుణంలో స్కూల్ ఉపాధ్యాయులు ఆమె విద్యాభ్యాసం దెబ్బతింటుందన్న ఉద్యేశ్యంతో అడిగినా సెలవులు ఇచ్చేవాళ్లు కాదు..
ఎలాగోలా ఉపాధ్యాయులను ఒప్పించి.. మౌనిక కొన్ని ప్రదర్శనలకు హాజరయ్యింది. అటు నృత్య ప్రదర్శనలు చేస్తూనే.. మరోక ప్రక్క స్కూల్ విద్యను కొనసాగించింది. మౌనికలో ఉన్న అకుంఠిత దీక్ష కారణంగా పదో తరగతి పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలైంది.
దీంతో పాటు నిత్యం నృత్యంపై ఉన్న ఆసక్తిని చూసిన ఉపాధ్యయులు ఆమెను ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహంతో 2006 జనవరిలో సంస్కార భారతి ఆధ్వర్యంలో ఇంగ్లాండ్‌లో జరిగిన నృత్య పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచిందీ మౌనిక.
ఆమెకు నృత్యం పట్ల ఎంత ఇష్టమో చెప్పడానికి ఉదాహరణ... కడుపు నొప్పి కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్న సమయంలోను నృత్య ప్రదర్శన ఇచ్చి అందరినీ అబ్బురపరిచింది ఈ అభినవ నాట్య కళామణి. మయూరి చిత్రంలోని మయూరి పాత్ర తనకెంతో ప్రేరణ కలిగించిందని మౌనిక ఘంటా పథంగా చెబుతోంది.
రాష్ట్రంలోనే గాక, దేశం మొత్తం మీద ఎంతో మంది కళాకారులు అవకాశాలు రాక మృగ్యమైపోతున్నారు. మరిలాంటి రోజుల్లోను నైపుణ్యం మాత్రమే కాదు దానికి అపారమైన ఆత్మవిశ్వాసం కూడా ఉండాలని నిరూపించిన మౌనిక లాంటి కళామణులు జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిద్దాం..