దేశవ్యాప్తంగా నిత్యవసర సరకుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అలాగే, కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ఎక్కువమంది బలవర్ధక, పౌష్టికాహారమైన కోడిగుడ్డును ఆరగించేందుకు అమితాసక్తిని చూపేవారు. అయితే, ఈ కోడిగుడ్డు ధర కూడా ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఈ గుడ్డు ధర వింటే ఖచ్చితంగా గుడ్లు తేలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సాధారణంగా ధరలు రెండు, మూడు రూపాయలుండే గుడ్డు ధర ఇపుడు ఇప్పుడు ఏకంగా ఆరు రూపాయలకు చేరుకుంది. రిటైల్ ధర ఒక్కో గుడ్డుకు ఆరు రూపాయలైంది. ఇన్నాళ్లుగా కూరగాయల ధరలే చుక్కలు చూపిస్తుండగా, ఇప్పుడు గుడ్డుధర కూడా భారంగా మారింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు, వినియోగం పెరుగడం దృష్ట్యా మరో రెండునెలలు ఇదే పరిస్థితి ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రోజురోజుకు ధర పెరుగుతూ సోమవారం ఆల్‌టైం రికార్డును తాకింది. ఇంకా పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ధరలు ప్రతి యేడాది డిసెంబర్ మాసంలో పెరుగుతుంటాయి. కానీ, ఈ యేడాది నవంబరు నెలలోనే గరిష్టస్థాయికి చేరాయి. ఫలితంగా అటు కూరగాయల ధరలు మండిపోవడం, ఇటు కోడిగుడ్డు ధరలు కొండెక్కడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.