తెలంగాణ రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. నిన్న (ఏప్రిల్ 15,2021) రాత్రి 8గంటల వరకు 1,21,880 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 3వేల 840 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్, కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించే ఆస్కారం లేదని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. ప్రజలే కరోనా నిబంధనలు పాటించాలన్నారు. అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటికి రాకూడదని సూచించారు.
అలాగే రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా సెకండ్ వేవ్ గతంలో కంటే వేగంగా విస్తరిస్తోందని.. ప్రజలు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటివి తప్పనిసరిగా చేయాలని మంత్రి సూచించారు.