హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో విభేదాలు రచ్చరచ్చగా మారాయి. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న అజారుద్దీన్‌పై వేటు పడింది. ఈ నెల 2న హెచ్‌సీఏ అపెక్స్‌కౌన్సిల్ ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. అజారుద్దీన్‌పై ఉన్న కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఆయన సభ్యత్వాన్ని హెచ్‌సీఏ రద్దు చేసింది. ఇక అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంపై అజారుద్దీన్ స్పందన ఎలా ఉంటుందనేది కీలకంగా మారింది.
అజారుద్దీన్ టీమిండియా కెప్టెన్‌గా పని చేసిన విషయం తెలిసిందే. అయితే, ఏప్రిల్ 11న హెచ్‌సీఏ సర్వసభ్య సమావేశంలో అజారుద్దీన్, విజయానంద్ వాగ్వాదానికి దిగారు. సర్వసభ్య సమావేశంలో 130 మంది క్లబ్ మెంబర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అంబుడ్స్ మెన్ గా జస్టిస్ దీపక్ వర్మను నియమించారు. ఈ నియామకం విషయంలో అజారుద్దీన్, విజయానంద్ మధ్య స్టేజీపైనే ఘర్షణ జరిగింది.
ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల సెలక్షన్స్‌లో అవకతవకలు జరిగాయని చెప్పారు. అజార్‌పై మ్యాచ్ ఫిక్సింగ్ కేసు విషయంపై కేంద్రహోంమంత్రికి ఫిర్యాదు చేసి, ఆ కేసును సీబీఐతో పునర్విచారణ జరిపించాలని కోరతామని యెండల లక్ష్మీనారాయణ తెలిపారు. అటు ఎమ్మెల్సీ కవిత కూడా హెచ్‌సీఏలో జరుగుతున్న అవకతవకలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్‌సీఏలో ప్రక్షాళన చేపడతామని అన్నారు.