"అందితే జుట్టు అందకపోతే కాళ్లు".. ఇదీ హైద్రాబాద్ అల్లుడి కథ!

PTI
షోయబ్ మాలిక్.. పాకిస్థాన్ క్రికెట్ జుట్టు మాజీ కెప్టెన్. షోకుల రాయుడు.. జల్సా రాయుడు... చెక్కర్ల రాయుడు... పెళ్లిళ్ల రాయుడు.... ఇలా అనేకానేక పేర్లు ఈ బ్యాటుగాడి సొంతం. ఇవి మన భారతీయ మీడియా పెట్టుకున్న పేర్లు కాదండీ.. స్వయానా.. పాకిస్థాన్ మీడియా పెట్టుకున్న ముద్దు పేర్లు. వీటితోనే.. అయ్యగారి ఘనకీర్తి ఏపాటితో ఇట్టే అర్థమైపోయిందనుకుంటా.

ఇలాంటి ఘనాపాటికి మనం.. కాదుకాదు.. ఓ అవకాశవాద టెన్నిస్ తార రెండో భార్యగా ఉండేందుకు సమ్మతించింది. ఓకేలెండి.. అది.. ఆమె వ్యక్తిగత వ్యవహారం. మనకెందుకులెండీ. ఇంతకీ.. అమ్మగారిని మనువాడబోయే వరుడి కథాకమామిషు తెలుసుకుందాం.

ఈ అంతర్జాతీయ క్రికెట్ ఆటగాడు నోట్లో వేలుపెట్టినా కొరకలేని అమాయకుడట. ఒక అమ్మాయి బెదిరిస్తేనే పెళ్లికి సై అన్నాడట. ఇదేమీ మనకై మనం చెప్పుకోవడం లేదండీ. స్వయంగా ఈ హైద్రాబాదీ అల్లుడే సెలవిచ్చాడు. ఎందుకంటే.. తాను మోసపోయి, న్యాయపోరాటం ద్వారా విడాకులు తీసుకున్న అయేషా సిద్ధిఖీ కూడా ఈయనగారిని ఇదేవిధంగా మోసం చేశారట. ఫోన్‌లో హైదరాబాద్ యువతిని వివాహమాడిన ఘనాపాటి.

ఆ తర్వాత నిఖానామాపై స్వయంగా సంతంకం చేసినా.. తాను చేయలేదంటూ బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించిన జగత్ కిలాడీ. 2002 నుంచి ఇప్పటి వరకు 11 సార్లు భారత్‌కు ఏం పనిమీద వచ్చారో ఆయనగారికే ఎరుక. ఇపుడంటే.. కొత్త ప్రియురాలి (సానియా మీర్జా) ఇల్లు ఉంది. మరి గతంలో..? ఈ ప్రశ్నకు ఈ చెక్కర్ల రాయుడే సమాధానం ఇవ్వాలి. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఒక అబద్దానికి మరో అబద్దం ఇలా.. అతుకుల బొంతను కుట్టేందుకు ప్రయత్నించాడు.

ఈ ప్రయత్నాలు ఏవీ ఫలించక పోవడంతో మతపెద్దల సహకారంతో తన ద్వారా మోసపోయిన అభాగ్యురాలి కాళ్లు పట్టుకున్నాడు. తన భాగోతం తెలిసీ..తెలిసీ.. తన వలలో చిక్కుతున్న మరో యువతితో సరికొత్త సుఖ జీవితాన్ని అనుభవించేందుకు తహతహలాడుతున్న ఈయనగారు.. ఆ యాపిల్ పండు ఎక్కడ తనకు దక్కకుండా పోతుందోననే బెంగతో తన పరువు ప్రతిష్ట(అసలు ఉంటేకదా..!)లు పక్కన పెట్టాడు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు వరుస కట్టుకథలు అల్లాడు.

అయేషాను తాను అసలు చూడలేదని షోయబ్ చెప్పడం మొదటి కథ. నిఖానామాపై స్వయంగా సంతకం చేయడం, ఆపై.. తమ జట్టు క్రికెటర్లందరికీ అత్తగారి ఇంట్లో విందు పార్టీ ఇవ్వడం.. దీనికి మన భారతీయ మాజీ క్రికెటర్ అరుణ్ లాల్‌ను స్వయంగా ఆహ్వానించడం రెండో తప్పు. ఆ తర్వాత మొదటి భార్యతో సం"తృప్తి" చెందిన తర్వాత మరో యువతిపై మోజు పడింది. దీన్ని తీర్చుకునేందుకు సరికొత్త కథను అల్లాడు. తన వలలో టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా చిక్కడంతో వేయిరెట్ల బలం వచ్చినట్టయింది. ఆ మరుక్షణమే నిఖానామాపై ఉన్న సంతకం తనది కాదని, ఫోర్జరీ అని బొంకాడు.

అయితే, పాస్‌పోర్టును హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో దిక్కుతోచని షోయబ్.. పోలీసుల విచారణలో దోషిగా తేలాడు. పైపెచ్చు... తనతో పాటు పాక్ క్రికెటర్లంతా సంతకం చేసిన బ్యాట్‌, తనకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఇతర అవార్డులు సిద్ధికీ బయటపెట్టడంతో అవాక్కయ్యాడు. అన్నిటికంటే ముఖ్యంగా.. రతిక్రియలో పాల్గొన్నప్పుడు షోయబ్ మాలిక్ వీర్యకణాలతో కూడిన దుస్తులను మొదటి భార్య పోలీసులకు అందించింది. దీంతో అమ్మాయిల మోసగాడికి దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయింది.

ఇకపై కథను సాగదీస్తే హైదరాబాద్ జైలు ఊచలు లెక్కించాల్సి వస్తుందని గ్రహించి.. చేసిన తప్పును ఒప్పుకుని ముక్కును నేలకు రాశాడు ఈ హైద్రాబాదీ అల్లుడు షోయబ్. ఓ అంతర్జాతీయ ఆటగాడే నైజమే ఇలా ఉంటే.. ఇతగాడి కుటుంబ సభ్యుల వ్యవహారశైలిని షోయబ్ మాలిక్ సవతి సోదరుడు తారిఖ్ మాలిక్ పూసగుచ్చినట్టు వివరించాడు. అంతేకాదండీ.. షోయబ్ రెండో భార్య సానియా మీర్జాకు కొన్ని విలువైన సూచనలు చేశారు కూడా. ఈ సలహాలను అమ్మడు పాటిస్తుందో లేక.. మరో అయేషా సిద్ధికీ అవుతుందో కాలమే సమాధానం చెప్పాలి.

వెబ్దునియా పై చదవండి