ఏప్రిల్ 15 దాకా కాదు.. ఇప్పుడే పెళ్లి చేసుకుని "ఫో"
FILE
సానియా - షోయబ్ పెళ్లి వార్త. ఆ తర్వాత అయేషా సిద్ధిఖీ ఝలక్ మీద ఝలక్. అయేషాతో తన పెళ్లి నిజం కాదని బొంకిన షోయబ్‌కు "మహా"సిద్ధిఖీ అవతారం చూపించింది. అంతే..!! గురుడు కుదేలై ఆమెకు విడాకులిస్తానంటూ కాళ్ల బేరానికి వచ్చాడు. నాటకీయ పరిణామాల మధ్య "తలాక్" తంతు పూర్తయింది. ఆ తర్వాత పరిణామాలు చాలా వేగంగా రోజుకో మలుపు తిరుగుతూ సానియా కుటుంబాన్ని దాదాపు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయనే చెప్పాలి.
అల్లుడు గారి కీర్తిని పాకిస్తాన్ మీడియా తూర్పార బట్టడం మొదలుపెట్టింది. నైట్ పార్టీలలో అమ్మాయిలతో కాబోయే అల్లుడు వేసిన చిందులు తాలూకు చిత్రాలను చూపిస్తూ షోయబ్ కీర్తిని ఉతికి ఆరేస్తున్నాయి. ఇవాళ గడిస్తే రేపు మరే కొత్త కథనం వెలుగు చూస్తుందోనన్న ఆసక్తిని అక్కడి మీడియా కలిగిస్తోంది.
ఇక సానియా సంగతి చూస్తే... అనతికాలంలోనే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వంటి మేటి ఆటగాళ్ల బ్రాండ్ ఇమేజ్‌నే దాటి తారాస్థాయికి వెళ్లిన సానియా ఇమేజ్ షోయబ్‌తో పెళ్లి నిశ్చయం వార్తతో దబ్బున భూమ్మీద పడి అంతటితో ఆగకుండా పాతాళ లోకంలో ఉన్న లోతులను వెతుక్కుంటూ శరవేగంగా దూసుక వెళుతోంది. అందుకే మన పెద్దవారన్నారు. "గొడ్డొచ్చిన వేళా... బిడ్డొచ్చిన వేళా" అని. షోయబ్ పెళ్లితో సానియా ఇమేజ్ దాదాపు మటాష్ అయిపోయినట్లే కనబడుతోంది.
సూపర్ కంపెనీగా చెప్పుకునే బోర్నవీటా సానియాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని తిరిగి పునరద్ధరించేందుకు వెనకాడింది. మరికొన్ని కంపెనీలు కూడా ఇదే బాట పట్టనున్నాయని వినికిడి. ఇదిలావుంటే షోయబ్‌తో సానియా జత కట్టాలని నిర్ణయం తీసుకున్న దగ్గర్నుంచీ సానియా కుటుంబానికి కంటిమీద కునుకు లేకుండా పోయింది.
అసలు పెళ్లంటే ఏమిటీ...? కుటుంబంలో అదో అద్భుతమైన రోజు. మరువలేని శుభకార్యం. సంతోషాలు.. ఆనందాలన్నీ కలిసి ఇంట్లో నర్తించే మహత్తరమైన ఘడియల సమాహారం. ఎన్నటికీ మరిచిపోలేని ఆనంద క్షణాల నిలయం. అటువంటి ఆ శుభదినానికి ముందు కోపాలకూ.. తాపాలకూ తావే ఉండకూడదు. కానీ సానియా ఇంట్లో షోయబ్ అడుగు పెట్టిన నాటి నుంచీ వివాదాలు సుడింగుండంలా తిప్పేస్తుంటే... మరోవైపు ఆమె ఇంట్లో అలకలు.. చిన్నచిన్న మనస్పర్థలు... జరుగుతున్నట్లు భోగట్టా.
పీకల్లోతు వివాదాల్లో కూరుకుపోయిన ఏ వ్యక్తినైనా ఎవరైనా అల్లుడిగా కోరుకుంటారా...? అని ప్రశ్నించుకుంటే.. బహుశాః కోరుకోరనే చెప్పాలి. కానీ షోయబ్ మాలిక్, సానియా కుటుంబానికి పరిచయమైనప్పుడు ఉన్న సీన్ వేరు.. పెళ్లి ప్రపోజల్ పెట్టిన తర్వాత కనబడిన... కనబడుతున్న సీన్ వేరు. దాని నుంచి తప్పించుకునేందుకు బహుశా సానియా కుటుంబ సభ్యులు ప్రయత్నించే ఉండవచ్చు. కానీ ఆ ప్రయత్నాలన్నీ సానియా ముందు సాగితే కదా. ఎందుకంటే మన సానియా ఒక్కసారి షోయబ్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన తర్వాత అది వందసార్లు చెప్పినట్లు లెఖ్ఖ.
అందుకేనేమో సానియా కుటుంబం అమ్మడి పెళ్లిని చేసేందుకు ఏప్రిల్ 15 దాకా ఆగి, రోజుకో ట్విస్టును చూస్తూ, మీడియా కథనాలను వీక్షిస్తూ ఉండలేకే ఈ త్వరితగతి వివాహ నిశ్చయం చేశారని కొంతమంది జనం అంటున్నారు. అవును... మైండ్‌తో గేమ్ ఆడుకునే ట్విస్ట్‌లను భరించడం కష్టమే కదా మరీ...!!