ఫైటర్ల ప్రవర్తనే బంద్‌కు కారణం: డి. సురేష్ బాబు

శుక్రవారం, 31 డిశెంబరు 2010 (16:26 IST)
గత 23 రోజులుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న బంద్‌ ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. కార్మిక సమాఖ్య మేము షూటింగ్‌లకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రకటిస్తే... నిర్మాతలు మేము ఏమాత్రం లేమని విరుద్ధ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో అందరిలో గందరగోళం ఏర్పడింది. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత డి. సురేష్‌బాబుతో ప్రత్యేక ఇంటర్వ్యూ..

అసలు బంద్‌కు కారణం ఏమిటి?
ఫైటర్ల ప్రవర్తనే కారణం.

వారేం చేశారు?
డిసెంబర్‌ 8వ తేదీన 'కందిరీగ' షూటింగ్‌లో కొంతమంది లోకల్‌ ఫైటర్లు మందు తాగి వచ్చి చెన్నై ఫైటర్లను కొట్టారు. అక్కడ చిత్రనిర్మాతకు సంబంధించిన మెటీరియల్స్‌ను కూడా పాడుచేశారు.

వారికి పనిషిమెంట్‌ ఇస్తే సరిపోతుంది కదా?
కరెక్టే.. ఆ విషయం మేమే ఫైటర్స్‌ అసోసియేషన్‌కూ, ఫెడరేషన్‌కూ చెప్పాం. కానీ వారి నుంచి సరైన స్పందన లేదు. ఎవరైతే తాగి వచ్చి గొడవ చేశారో వారిని సస్పెండ్‌ చేయమని చెప్పాం. కానీ వారు నీళ్ళు నములుతూ సమస్యను వాయిదా వేస్తూ వచ్చారు.

ఫెడరేషన్‌ చర్చలకు సమ్మతమేనని అంటున్నారు?
ఆ విషయం నేనూ పేపర్లలోనే చూశాను. రిటర్న్‌గా మాకు ఎలాంటి మెసేజ్‌ లేదు. గొడవ జరిగిన మరుసటిరోజు చర్చలకు వస్తామన్నారు. 3.30 గంటలవరకు చూశాం. స్పందనలేదు. 4.30 తర్వాత ఫ్యాక్స్‌ వచ్చింది. అప్పటికే ఛాంబర్‌ పనివేళలు పూర్తయ్యాయి. దాంతో నిర్మాతలు కూడా తమ సమస్యలు కూడా ముందుకు తెచ్చారు. దాంతో బంద్‌కు పిలుపు ఇవ్వాల్సి వచ్చింది.

ఫైటర్ల గొడవ జరగకపోతే బంద్‌ ఉండేదా?
వారి గొడవ లేకపోతే బంద్‌ అవసరం రాదు.

కానీ కొంతమంది నిర్మాతలు వారిది సమస్యే కాదంటున్నారు. మా సమస్యలున్నాయి అంటున్నారు?
అవును. నిర్మాతల సమస్యలు చాలా ఉన్నాయి. సినిమా అంటే తెలీని వారు వచ్చేసి ఇండస్ట్రీని పాడుచేస్తున్నారు. విపరీతంగా నిర్మాణవ్యయాన్ని పెంచేస్తున్నారు. సినిమాలు కూడా ఆడడంలేదు. అవన్నీ కలిసి వచ్చాయి.

హీరోల పారితోషికంపై ఏ నిర్ణయం తీసుకుంటున్నారు?
ముందుగా నిర్మాణవ్యయంలో భాగంగా అనవసరపు ఖర్చులు తగ్గించాలనేది ఆలోచన. దర్శకుడు అవగాహన ముందుగా బడ్జెట్‌ ఇవ్వమని, కాల్షీటు ఎలా ప్లాన్‌చేస్తున్నారో తెలియజేసేలా అగ్రిమెంట్‌ రాసుకుంటున్నాం. అలా చేస్తేనే రీష్యూట్‌లు వేస్టేజ్‌లు అవ్వవు.

నాగవల్లిచిత్రంలో ఐదుగురు హీరోయిన్లు. అంత ఖర్చు అవసరమా?
అదినిర్మాతకు సంబంధించింది. చిత్ర కథ ప్రకారం దర్శకుడు అడిగాడు. దానికంటే ముందు... రాజు గెటప్‌లో షూటింగ్‌ చేయడానికి రెండు ప్లేస్‌లు మార్చాం. దర్శకుడు సెట్లో చేద్దామన్నాడు. దానికోసం అంతా ప్లాన్‌ చేసుకున్నాడు నిర్మాత. ఆర్ట్‌ దర్శకుడు కూడా సెట్‌ వేశాడు. కానీ ఇంకా క్లారిటీకోసం విజయనగరంలో చేయాలని అన్నాడు.

దీంతో అదనపు ఖర్చు పెరిగింది. అక్కడకు వెళ్ళి చేస్తే వర్షం వల్ల మొత్తం అప్‌సెట్‌ అయింది. దాంతో తిరిగి మళ్ళీ హైదరాబాద్‌లో సెట్‌లో చేశాం. పెద్దా చిన్న దర్శకులనే కాదు. వారిని కంట్రోల్‌ చేయాలంటే.. అగ్రిమెంట్‌ తప్పనిసరి ఉండేవి. ఇంతవరకు నమ్మకంపై నడిచేది. ఇప్పుడలా కాదు.

ఫైటర్ల సమస్యను ఎలా సాల్వ్‌ చేస్తారు..?
తప్పుచేసినవారు ఎవరైనా క్షమార్హులు కాదు. దానికి లోకల్‌ ఫైటర్లు వారి అసోసియేషన్‌ సరిగ్గా స్పందించడం లేదు. వారు సస్పెండ్‌ అవుతునే నిర్మాత తాను షూటింగ్‌ చేస్తానంటున్నారు. ఇదేకాదు ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి.

మరి ఫైటర్లు తమకు 50:50 ప్రకారం పనికావాలంటున్నారు కదా?
కరెక్టే.. అది ఫైటర్ల అసోసియేషన్‌ సమస్య. చెన్నై ఫైటర్లకు తెలుసు. కానీ వారు సరిగ్గా అమలు చేయలేనప్పుడు లోకల్‌ ఫైటర్ల అసోసియేషన్‌తో పట్టుబట్టి చేయించాలి. లేదా ఛాంబర్‌ దృష్టికి తేవాలి.

చెన్నైవారు తమకు చీప్‌గా చూస్తున్నారని లోకల్‌వారు అంటున్నారు?
చూస్తారు. అది కామన్‌. చిన్నచిన్న ఫైట్లు మాత్రమే వీరు చేయగలరనే అభిప్రాయం కూడా ఉంది. లోకల్‌ ఫైటర్లలో యూత్‌ చాలా మంది ఉన్నారు. చైన్న వారితో సమానంగా ఫైట్స్‌ చేయగలరు. కానీ ఇక్కడ ఫైటర్లకు చెందిన పెద్దలు వారిని రానివ్వరు. వయస్సు మీదబడినా సీనియర్లే వచ్చి ఫైట్లు చేస్తామంటారు.

ఒక ఉదాహరణ చెబుతా.... ఓ సీన్‌లో కాల్పులు జరుగుతాయి. పోరాటాలు కూడా ఉన్నాయి. దూకడాలు, అద్దాలు పగిలిపోతే పడిపోవడాలు చేయాలి. లోకల్‌ ఫైటర్లు 10 మంది వస్తారు. అంతా... తాము కాల్పులో చచ్చిపోయే పాత్రలువేస్తాం అంటారు. చనిపోయే పాత్ర వేస్తే... ఆ సీన్‌ ఉన్నన్ని రోజులు అతను అలా పడుకుని ఉండాలి. కష్టపడనవసరంలేదు. ఎవరికివారు పోటీపడతారు. మరికొంతమంది వెనకాలే ఉంటాం అంటారు.

ఎందుకంటే... వారంతా మోకాలు సమస్యలతో, వెన్నెనొప్పితో ఇలా రకరకాల సమస్యల్తో ఉంటారు. కానీ లోకల్‌ యూత్‌ ఫైటర్లను ప్రోత్సహించరు. అందుకే చెన్నై ఫైటర్లు కష్టపడేవారిని పెట్టుకుని పని చేయిస్తారు. నిర్మాతకు కావాల్సింది పని జరగాలి. దానికి లోకల్‌ నాన్‌లోకల్‌ సమస్యతో సంబంధంలేదు. అది అసోసియేషన్‌ చూసుకోవాలి. నిర్మాతకు ఎవరితోనైనా పనిచేసుకునే హక్కు ఉంది.

ఈ సమస్యకు ఫుల్‌స్టాప్‌ ఎప్పుడు?
అది ఫెడరేషన్‌ చెప్పాలి. ఇప్పటికిప్పుడు మేము వారిని సస్పెండ్‌ చేసి ఇక్కడి రూల్‌ ప్రకారం నడుచుకుంటామంటే.. వెంటనే బంద్‌ ఆగిపోతుంది.

మొన్ననే ఛాంబర్‌, ఫెడరేషన్‌ షూటింగ్‌లు చేస్తామని ప్రకటించింది?
అది తప్పుడు ప్రకటన. నిర్మాతలకు తెలియకుండా ఛాంబర్‌ అధ్యక్షుడు చేసిన తప్పిదం. ఆ తర్వాత ఆయన సారీ కూడా చెప్పాడు. నిర్మాత డబ్బు పెట్టి సినిమా తీయందే పనెలా చేస్తారు? అని ముగించారు.

వెబ్దునియా పై చదవండి