తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. అమ్మ త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని కార్యకర్తలంతా పండగ చేసుకుంటున్న వేళ.. అమ్మ ఆరోగ్యం కుదుటపడాలని ఆమె కోసం యజ్ఞం చేస్తున్న అన్నా డీఎంకే నేతలను తేనెటీగలు కుట్టిన సంఘటన తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో జరిగింది. వడచేరి శక్తి మరియమ్మన్ కోయిల్ ప్రాంగణంలో అమ్మ కోసం యజ్ఞం నిర్వహించారు.
ఈ యజ్ఞంలో అంబూరు ఎమ్మెల్యే ఆర్.బాలసుబ్రమణి, గుడయతం ఎమ్మెల్యే జయంతి సహా 8 మంది అన్నాడీఎంకే నేతలు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలోని ఒక రావిచెట్టు కింద ఈ యజ్ఞం నిర్వహిస్తున్నారు. అయితే, పొగ కారణంగా ఆ చెట్టు కొమ్మల్లో ఉన్న పెద్ద తేనెతుట్టెలోని తేనెటీగలు బయటకు రావడం, అన్నాడీఎంకే నేతలను కుట్టేయడం క్షణాల్లో జరిగిపోయింది. తేనెటీగల బారి నుంచి తప్పించుకునేందుకు నానా తంటాలు పడినా ఫలితం లేకపోయింది.
ఎమ్మెల్యే జయంతి మాత్రం ఒక కారులోకి ఎక్కి కూర్చుని డోర్ వేసుకున్నారు. అయితే, ఆమె భర్త పద్మనాభన్, ఎమ్మెల్యే బాలసుబ్రమణి, మిగిలినవారు మాత్రం తేనెటీగల దాడి నుంచి తప్పించుకోలేకపోయారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిని సమీక్షించడానికి ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులు మరో సారి చెన్నై వస్తున్నారని సమాచారం. అదే విధంగా లండన్ వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ సైతం మరోసారి జయలలిత ఆరోగ్య పరిస్థితిని సమీక్షించనున్నారని సమాచారం. నెల రోజులకు పైగా జయలలిత పడకమీదే ఉన్నారు. ఆమె కాళ్లు, చేతులు కొద్దిగా స్వాధీనం తప్పడంతో సింగపూర్‌కు చెందిన ఇద్దరు మహిళా ఫిజియోథెరఫీ వైద్యులు జయలితకు చికిత్స చేశారు.