భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఠాగూర్

శుక్రవారం, 18 జులై 2025 (19:14 IST)
దాంపత్య జీవితంపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్తతో భార్య శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చని వ్యాఖ్యానించింది. భర్తతో శృంగారానికి నిరాకరించడం, వివాహేతర సంబంధాలున్నాయని అతడిని అనుమానించడం క్రూరత్వంతో సమానమన్నారు. విడాకులు పొందేందుకు వీటిని కారణాలుగా పేర్కొనవచ్చని తెలిపింది. ఫ్యామిలీ కోర్టు మంజూరు చేసిన విడాకులను సవాలు చేస్తూ ఓ మహిళ వేసిన పిటిషన్ ను ఈ సందర్భంగా తోసిపుచ్చింది. 
 
విడాకులకు అనుమతిస్తూ ఫ్యామిలి కోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఓ మహిళ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తనకు నెలకు రూ.లక్ష భరణం చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ రేవతి మోహితే డెరే, జస్టిస్ నీలా గోఖలేల ధర్మాసనం విచారించింది. తోటి ఉద్యోగులు, అతడి స్నేహితుల ముందు ఆమె ప్రవర్తించిన తీరు దారుణంగా ఉందని భావించాల్సి వస్తుందని పేర్కొంది. అంతేకాకుండా దివ్యాంగురాలైన భర్త సోదరి, ఆయన కుటుంబీకుల పట్ల ఉదాసీనత చూపించడం కూడా అతడి బాధకు కారణాలుగా అభిప్రాయపడింది.
 
2013లో వివాహం చేసుకున్న ఆ జంట.. ఆ యేడాది తర్వాతి నుంచి విడివిడిగా ఉంటోంది. శృంగారానికి నిరాకరించడంతోపాటు వివాహేతర సంబంధాలున్నాయని అనుమానిస్తూ వేధిస్తోందని.. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగుల ముందు ఇబ్బంది పెడుతూ మానసిక వేదనకు గురిచేస్తోందని భర్త ఆరోపించాడు. పుట్టింటికి వెళ్లిపోయినప్పటి నుంచి తనను పట్టించుకోవడం లేదని వాపోయాడు.
 
ఇలా భార్య ప్రవర్తనతో తీవ్ర వేదనకు గురవుతున్నానని, విడాకులు మంజూరు చేయాలని కోరుతూ 2015లో పుణెలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన న్యాయస్థానం అందుకు అనుమతించింది. దీనిని సవాలు చేస్తూ ఆ మహిళ బాంబే హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురయ్యింది. అయితే, అత్తమామలు మాత్రమే తనను వేధించారని, భర్తపై తనకు ప్రేమ ఉందని, విడిపోవాలని కోరుకోవడం లేదని భార్య పిటిషన్ లో పేర్కొనడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు