ఆహార ద్రవ్యోల్బణం తారా జువ్వలా పెరుగుతోంది. దేశ వ్యాప్తంగా ఉల్లిపాయలతో పాటు. పండ్లు, తృణధాన్యాల ధరలు పెరిగిన కారణంగా ఆహార ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకుంది. డిసెంబరు 18వ తేదీతో ముగిసిన వారానికి క్రితం వారం ఉన్న 12.13 శాతం నుంచి 14.44 శాతానికి పెరిగింది. ఇలా ఆహార ద్రవ్యోల్బణం పెరగటం వరసగా ఇది ఐదోసారి కావడం గమనార్హం.
అయితే, గతేడాది ఇదే వారంలో ఆహార ద్రవ్యోల్బణం 21.19 శాతంగా ఉండేది. దాంతో పోల్చుకుంటే ఇది తక్కువగానే ఉన్నట్టు కేంద్ర వర్గాలు చెపుతున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఉల్లిపాయలు వార్షిక ప్రాతిపదికన 4.36 శాతం పెరగ్గా, వారం ప్రాతిపదికన అంతకుముందు వారం కన్నా ద్రవ్యోల్బణం లెక్కకట్టే వారానికి 3.49 శాతం పెరిగింది.
అదేవిధంగా కూరగాయల ధరలు వార్షిక ప్రాతిపదికన 4.58 శాతం పెరిగాయి. ఇక పండ్లు అయితే 19.01 శాతం, పాలు 24.64 శాతం, కోడిగుడ్లు, మాంసం, చేపలు 31.21 శాతం చొప్పున పెరిగాయి. తృణ ధాన్యాలు మొత్తంగా 7.77 శాతం పెరగ్గా, అందులోని పప్పుధాన్యాలు 13.82 శాతం పెరిగాయి. అలానే బియ్యం 7.36 శాతం, గోధుమలు 8.32 శాతం చొప్పున వార్షిక ప్రాతిపదికన పెరిగాయి. ప్రధానంగా ఉల్లిపాయల ధరలు రూ.80కి చేరడం ఆహార ద్రవ్యోల్బణంపై తీవ్రప్రభావం చూపింది.