తెలుగుదేశంను బలహీన పరచడమే కాంగ్రెస్ ఏకైక లక్ష్యం!!

శుక్రవారం, 31 డిశెంబరు 2010 (15:23 IST)
తెలంగాణ అంశాన్ని అడ్డుపెట్టుకుని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీని బలహీనపరచడమే ఏకైక అజెండాగా కాంగ్రెస్ అధినాయకత్వం వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులోభాగంగానే జనవరి 6వ తేదీన జరిగే అఖిలపక్ష సమావేశానికి కూడా ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు నేతలను ఆహ్వానించడం వెనుక ఉన్న ఆంతర్యం కూడా ఇదేనని వారు అంటున్నారు.

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు రెండుకళ్ళ సిద్ధాంతంతో ముందుకు సాగుతున్నారు. తనకు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలు రెండూ రెండు కళ్ళతో సమానమన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర నేతలు మాత్రం వేర్వేరుగా విడిపోయినప్పటికీ.. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి గంగిరెద్దుల్లా తలాడించడం సాధారణం.

ఇకపోతే.. చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ, సీపీఎం పార్టీలు సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నట్టు బహిరంగంగా ప్రకటించాయి. సీపీఐ, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీలే తెలంగాణకు అనుకూలంగా ఉన్నాయి. జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలోని లోక్‌సత్తా కూడా రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని వాదిస్తోంది. విభజనతో అభివృద్ధి అసాధ్యమని, సమైక్యంగానే ముందుకు సాగాలని జయప్రకాష్ నారాయణ్ గట్టిగా వాదిస్తున్నారు.

ఒక్క తెదేపా వాదన మినహా మిగిలిన అన్ని పార్టీలు ఏదో విధంగా ఒకవైపుకు మొగ్గు చూపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే నెల ఆరో తేదీన గుర్తింపు పొందిన ఎనిమిది పార్టీలతో నిర్వహించనున్న సమావేశానికి ఇద్దరేసిని కేంద్రం హోంశాఖ ఆహ్వానించనుంది. పార్టీ అధ్యక్షులను, పార్టీ విధానాన్ని తెలియజేయాలని చిదంబరం ఎక్కడా ప్రస్తావించడం లేదు. అందుకే ఆయన ఇద్దరేసి ప్రతినిధులను ఆహ్వానించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని ఎండగట్టడమే ప్రధాన వ్యూహంగా తెలుస్తోంది. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని ఎండగడుతూ తెలంగాణలోనూ సీమాంధ్రలోనూ తెదేపాను బలహీనపరచడమే కాంగ్రెస్, చిదంబరంలు పావులు కదుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి