కేకేఆర్‌కు ఫిబ్రవరి వరకు తెలంగాణ కాంగ్రెస్ నేతల డెడ్‌లైన్!!

శనివారం, 8 జనవరి 2011 (15:00 IST)
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు డెడ్‌లైన్ విధించారు. వచ్చే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టక పోతే తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తామని హెచ్చరించినట్టు సమాచారం. జస్టీస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక బహిర్గతమైన తర్వాత సీఎంను తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు సమావేశమైన విషయం తెల్సిందే. ఆ సమయంలో ఈ విషయాన్ని వారు కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.

అంతేకాకుండా, సీఎం ముందు వారు మూడు డిమాండ్లను ఉచ్చినట్టు సమాచారం. ఇందులో ఒకటి.. ఉస్మానియా వర్శిటీలో మొహరించిన సాయుధ బలగాలను తక్షణం ఉపసంహరించాలని వారు షరతు విధించారు. అలాగే, రాష్ట్రంలో మీడియాపై ఉన్న ఆంక్షలను కూడా ఎత్తివేయాలని వారు గట్టిగా కోరినట్టు తెలుస్తోంది.

అలాగే, రెండో డిమాండ్‌కు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టించే బాధ్యతను స్వీకరించాలని కోరగా, దీనికి ఆయన సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. ఏది ఏమైనా.. బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టకుంటే మాత్రం తమ పదవులకు రాజీనామా చేస్తామని పలువురు హెచ్చరించినట్టు వినికిడి.

అంతేకాకుండా తమ హెచ్చరికను అంత తేలిగ్గా తీసుకోవద్దని తెలంగాణ బిల్లు పెట్టక పోతే రాష్ట్ర సర్కారు కూలిపోవడం తథ్యమని ఇంకొందరు జోస్యం చెప్పినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు భవితవ్యం ఫిబ్రవరిలో తేలిపోనుంది.

వెబ్దునియా పై చదవండి