పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీకి అమెరికా ప్రత్యేక భద్రత!!
పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీకి అమెరికా ప్రత్యేక భద్రతను కల్పించనుంది. అధ్యక్షునికి భద్రత కల్పించే అంశంపై పాకిస్థాన్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి పట్ల వైట్‌హౌస్ సానుకూలంగా స్పందించింది. దీంతో జర్దారీ భద్రతను అమెరికా ప్రత్యేక భద్రతా సిబ్బంది కల్పించే అవకాశం ఉంది. ఇటీవల పంజాబ్ గవర్నర్ సల్మాన్ తసీర్‌ను ఆయన భద్రతా సిబ్బందే కాల్చి చంపిన విషయం తెల్సిందే. దీంతో జర్దారీకి భద్రత కల్పిస్తున్న సిబ్బందిపై పాక్ పాలకులకు నమ్మకం సన్నగిల్లింది. ఈ విషయాన్ని ఇటీవల వాషింగ్టన్‌లో పర్యటించిన జర్దారీ అమెరికా దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై పాక్ మీడియా పలు రకాల కథనాలను ప్రసారం చేసింది. జర్దారీ భద్రతా వ్యవహారం ప్రభుత్వానికి ఎప్పుడూ ఆందోళనకరంగానే ఉన్నట్టు పాక్ పాలకులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల అధ్యక్షుడు, ప్రధాని, రాష్ట్ర గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కొంతమంది ఫెడరల్ మంత్రులతో సహా పలువురు ప్రముఖులకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన విదేశీ భద్రతా సిబ్బందిని నియమించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు ఆ వార్తా కథనాలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుత భద్రతా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న నిపుణుల సిఫార్సును ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. అత్యంత ప్రముఖుల భద్రతకు ఇది అత్యవసరమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్లు ఈ పత్రిక వివరించింది. ప్రస్తుతం సైన్యంలోని 111 బ్రిగేడ్‌ను అధ్యక్షుడు జర్దారీకి భద్రత కల్పించేందుకు వినియోగిస్తున్నారు. వీరితో పాటు.. అమెరికా ప్రత్యేక సిబ్బంది భద్రత కల్పించే అవకాశం ఉందన్నారు.