అని దత్తాత్రేయుడిని స్మరించుకుంటే కోరిన కోర్కెలను తీరుస్తాడు. దత్తాత్రేయుడు భక్తవత్సలుడు. భక్తులపై అంతులేని కారుణ్యాన్ని కురిపిస్తాడు. దత్తాత్రేయుని ఆరాధించేందుకు ఆర్భాటాలూ, ఆడంబరాలు అక్కర్లేదు. నిండు మనస్సుతో, నిష్కల్మషమైన హృదయంతో ప్రార్థిస్తే చాలు, ప్రత్యక్షమై వరాలు కురిపిస్తాడు. అందుకే దత్తాత్రేయుని ‘స్మృతిగామి’ అంటారు.
దత్తాత్రేయుడు విశిష్టమైన ఆచార్యస్థానం ఆక్రమించాడు. ఈ విశిష్టమైన స్థానం ఇంత తేలిగ్గా లభించిందా అని ఆశ్చర్యపోనవసరం లేదు. సాక్షాత్తూ దేవదేవుడైన దత్తాత్రేయుడు 24 మంది గురువుల వద్ద విద్యను అభ్యసించాడు. కనుకనే దత్తాత్రేయుని పరమ గురువుగా కొలుస్తున్నాం.
దత్తాత్రేయుడు గురువులకే గురువు విజ్ఞాన ఖని. అయినప్పటికీ సాధారణ వ్యక్తిలా గురువుల వద్ద వినయంగా విద్యను అభ్యసించిన సద్గుణ సంపన్నమూర్తి. సకల వేదస్వరూపుడు. జ్ఞానామృతాన్ని జగత్తుకు పంచిన సద్గురు చక్రవర్తి. మౌనముద్రతోనే శిష్యుల సందేహాలను నివృత్తి చేసి గురుస్థానం దక్కించుకున్న దత్తాత్రేయుడు విశ్వానికే గురువయ్యాడు.
అందుకే దత్తాత్రేయుని
''జన్మ సంసార బంధఘ్నం స్వరూపానందదాయకం
నిశ్రేయసప్రద వందే స్మర్త్రగామీ నమావతు''
అని ప్రార్ధించుకుంటాం. జన్మ సంసార బంధనాల్ని తేలిగ్గా తెంచగలిగిన మహానుభావుడు, జ్ఞాననందాన్ని పంచగలిగిన ప్రేమమూర్తి, ముక్తిపథంలో నడిపించి మోక్షాన్ని ప్రసాదించగలిగిన పరమ యోగీశ్వరుడు దత్తాత్రేయుడు.
మనసా స్మరించినంత మాత్రాన సాక్షాత్కరించే దయాసింధువు దత్తాత్రేయుడు. అందుకే దత్తాత్రేయుని స్మరించుకుంటే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు.