వాస్తు ప్రకారం నైరుతిలో 'మాస్టర్ బెడ్‌రూమ్' ఉండాలట!
మంగళవారం, 4 అక్టోబరు 2011 (17:30 IST)
FILE
దేవుళ్ళను పూజిస్తాం, ఇది మన సంప్రదాయం. దేవుళ్ళ మధ్య ఒక రాక్షసుడు ఉన్నాడు. అతడినీ జాగ్రత్తగా చూసుకుంటాం. అది వాస్తు సంప్రదాయం. అష్టదిక్కుల్లో ఏడుదిక్కులకు దేవతలు, మహనీయులు అధిపతులు. ఒక దిక్కుకు మాత్రం రాక్షసుడు అధిపతి. అతడి పేరు "నిర్ఋతి". దుష్టులకు దూరంగా ఉండాలని పెద్దలు చెబుతారు. వాస్తు శాస్త్రం ఇందుకు భిన్నంగా చెబుతుంది. దుష్టుడి దగ్గరే ఉండమని చెబుతుంది. నైరుతి యజమాని స్థానమని వాస్తు శాస్త్రవేత్తలు ఏకగ్రీవంగా చెబుతారు.
వాస్తు శాస్త్రప్రకారం మాస్టర్ బెడ్‌రూం నైరుతిలో ఉండాలి. అంటే యజమాని అక్కడే పడకవెయ్యాలి. నైరుతిలో ఎత్తు, బరువు ఎక్కువగా ఉండాలి. రాక్షసుడిని ఊరికే వదిలిపెడితే, ఊరుకోడు. అందువల్ల అతడి నెత్తిన బరువు పడేస్తే కిమ్మనకుండా ఉంటాడు. మన పనులు మనల్ని చేసుకోనిస్తాడు. ప్రాచీన వాస్తుశాస్త్రవేత్తలు 'నైరృత్యాం మలమూత్రం చ' అన్నారు. అంటే బాత్‌రూంలు, లెట్రిన్లు నైరుతి గదిలో ఉంటే మంచిది. ఇక్కడొక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నైరుతిలో గోతులు తవ్వకూడదు. గోతులు లేని లెట్రిన్ ఉండాలి.
నైరుతి ఎంత ఎత్తుగా ఉంటే ఇంటి యజమాని అంత ఉన్నతస్థితిలో ఉంటాడు. పరిసరాల్లో కూడా నైరుతి బాగుండాలి. ఇంటికి నైరుతిలో కొండలు, గుట్టలు ఉంటే ఇంటిలో వారందరికీ హాయి. నైరుతిమూలలో ఏ కార్యకలాపాలు చేపట్టినా అవి ముమ్మరంగా సాగుతాయి. నిద్రపోతే నిద్ర బాగా పడుతుంది. నైరుతి బీరువాలో డబ్బు పెడితే ధనవృద్ధి జరుగుతుంది. ఉత్తరం కుబేరస్థానమని అందరికీ తెలిసినా, అందరూ నైరుతిలోనే డబ్బు పెట్టుకునే బీరువా ఉంచడానికి కారణం ఇదే.
స్థిరమైన వస్తువులు ఉంచడానికి నైరుతికి మించిన దిక్కు మరొకటి లేదు. అందుకే వృద్ధి కావలసిన విలువైన బంగారు ఆభరణాలు, వెండినగలు నైరుతిమూలలోని బీరువాలో భద్రపరుచుకోవాలి. నైరుతిలో ఖాళీస్థలం పెరగకూడదు. పెరిగితే రాక్షసుడి స్వైరవిహారం జరిగి ఇంటిలోనివారు ఇక్కట్లపాలవుతారు. నైరుతిలో ఖాళీస్థలం తగ్గడం శుభకరం. అయితే మట్టంగా తగ్గాలి తప్ప కోణంగా తగ్గకూడదని వాస్తుశాస్త్రవేత్తలు సూచిస్తారు.
నైరుతి రోగకారకుడు. నైరుతి దిక్కులోని లోపాలవల్ల ఇంటిలోనివారు వ్యాధులకు గురయి ఆసుపత్రుల పాల య్యే ప్రమాదం ఉంది. నైరుతిలోని దోషాలు విపరీతంగా ఉంటే ఆ ఇంటిలోని వ్యక్తులు ఉన్మాదులయ్యే ప్రమాదం కూడా వుంది. హత్యలు, ఆత్మహత్యల వంటి దుస్సంఘటనలు నైరుతి దోషాలు ఉన్న ఇళ్ళలో జరిగే ఆస్కారం ఉంది.
నైరుతి అనేది నీచదిక్కు. పశ్చిమ నైరుతి, దక్షిణ నైరుతి రెండూ నీచ దిక్కులే. పశ్చిమ నైరుతిలోని దోషాల ప్రభావం పురుషుల మీద, దక్షిణ నైరుతి దోషాల ప్రభావం మహిళలమీద ఉంటుంది. మొత్తం మీద నైరుతి ప్రభావం యజమాని, యజమానురాలు, పెద్దకొడుకుల మీద ఉంటుంది. నైరుతి నీచస్థానం కాబట్టి అక్కడ గేట్లుకానీ, ముఖద్వారం కానీ, కనీసం ద్వారాలు గానీ పెట్టుకోకూడదు. నైరుతి దిక్కు వీలయినంత మూసి ఉంచాలి.
నైరుతి తెరపి వల్ల ఎడతెరపిలేని దుఃఖం వస్తుంది. ఇంటి ఆవరణలో నైరుతిలో అతి తక్కువ ఖాళీస్థలం వదలాలి. ఈ రోజుల్లో ఎక్కువ మంది ఏ మాత్రం ఖాళీస్థలం కూడా వదలకుండా కాంపౌండ్ గోడమీద ఇల్లు కట్టుకుంటున్నారు. అయితే అది అంత మంచిది కాదు. పక్కస్థలంలోని దోషాల ప్రభావం ఈ ఇంటిమీద పడుతుంది. అంటే పక్క స్థలంలో గోతులుగానీ, నూతులుగానీ ఉంటే అది దుష్ప్రభావం కలిగిస్తుంది. ఇంటిలో కూడా నైరుతిగది మెరకగా ఉండాలి. పల్లంగా ఉండకూడదు. నైరుతి గదిలో ఫ్లోరింగ్ లెవెల్ ఇతర గదులతో పోల్చుకుంటే ఎక్కువగా ఉండాలి.
నైరుతిలో ఎంత అపరిశుభ్రమైన వస్తువులైనా వేయవచ్చు. చీపురు కట్టల వంటివి నైరుతిమూలలో ఉంచడం శ్రేయస్కరం. ఇల్లు చిమ్మడంలో కూడా ఒక వాస్తుపద్ధతి ఉంది. ఇల్లు చిమ్మడాన్ని నైరుతినుంచే ప్రారంభించాలని వాస్తుశాస్త్రవేత్తలు చెబుతారు. అంతేకాదు గృహనిర్మాణం కూడా నైరుతి నుంచే ప్రారంభించాలంటారు. నిర్మాణాలన్నీ నైరుతి నుంచి ప్రారంభించాలి. నిర్మాలనలన్నీ ఈశాన్యం నుంచి ప్రారంభించడం శ్రేయస్కరం.
ఇల్లు నిర్మించే ముందు గృహ నిర్మాణం సొమ్మును, సిమెంట్ బస్తాలను నైరుతి మూలలో ఒక చిన్నగది నిర్మించి అందులో ఉంచడం అభిలషణీయం. నైరుతి నడక మంచిది కాదు. నైరుతి మనకు ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని అందిస్తుంది. నైరుతిని మనం అదుపు చేసుకుంటే, సర్వసంపదలు మన అధీనంలో ఉన్నట్టేనని వాస్తు నిపుణులు అంటున్నారు.