కరోనా వార్డులో డాక్టర్ వేషంలో మోసాలకు పాల్పడుతున్న మాయలేడి

గురువారం, 30 జులై 2020 (15:16 IST)
కరోనావైరస్ రోగి దగ్గరికి వెళ్లాలంటే కుటుంబ సభ్యులు సైతం హడలిపోతున్న తరుణంలో ఓ మాయా లేడి ఏకంగా వైద్యురాలి వేషంలో కరోనా వార్డులో తిరుగుతూ మొబైల్ పోన్లు కొట్టేస్తూ రోగుల బంధువుల నుంచి డబ్బులు దండుకుంటూ మోసాలకు పాల్పడుతుంది.
 
ఇప్పుడామె కటకటాల వెనక్కి చేరింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పెద్ద సంఖ్యలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ వైద్యుల సంఖ్య కూడా ఎక్కువే. పీపీఈ కిట్ ధరిస్తే ఎవరు వైద్యులో ఎవరు కాదో చెప్పడం చాలా కష్టం. దీన్ని ఆసరాగా చేసుకొని శైలజ(43) అనే మహిళ డాక్టర్ వేషం వేసి కరోనా వార్డులో చోరీలకు తెగపడింది.
 
కరోనా పేషెంట్ల ఫోన్లు కాజేయడమే కాకుండా వారికి మెరుగైన సేవలు అందిస్తామని చెబుతూ రోగుల బంధువుల నుంచి డబ్బులు వసూలు చేసింది. తమ వాళ్ల పరిస్థితి ఏమని ఎవరైనా అడిగితే వారి పరిస్థితులను ఆసరాగా చేసుకొని వారి దగ్గరనుండి డబ్బుల వసూలు చేసేది. పీపీఈ కిట్‌తో నిత్యం కరోనా వార్డులో తిరుగుతున్న శైలజ గురించి సెక్యూరిటి సిబ్బందికి అనుమానం వచ్చింది. వారు ప్రశ్నించగా పారిపోయింది.
 
మళ్లీ మరుసటి రోజు రావడంతో మహిళా సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు