ఏపీలో ఇండ్ల స్థలాల దరఖాస్తుకు మరో అవకాశం

గురువారం, 21 మే 2020 (06:39 IST)
ఇండ్ల స్థలాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులకు మరో అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

అర్హులు ఎవరైనా దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోతే వారికి మళ్లీ అవకాశం ఇవ్వాలని సిఎం సూచించారు. మరో 15 రోజులు సమయమిచ్చి దరఖాస్తులు తీసుకోవాలని, పరిశీలన అనంతరం గామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలు పెట్టాలని ఆదేశించారు. 
 
హౌసింగ్‌, పేదలకు ఇళ్లస్థలాల పట్టాలు, నాడు-నేడు కింద కార్యక్రమాలు, ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయం, తాగునీరు, ఉపాధి హామీ, కరోనా నివారణా చర్యలు తదితర అంశాలపై ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం సమీక్షించారు.
 
జులై 8న 27 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ దరఖాస్తులకు సంబంధించి ఏమైనా కొత్తగా భూములు కొనుగోలు చేయాల్సి వస్తే, చేయాలన్నారు. పక్షపాతం లేకుండా ఈ ప్రక్రియ సాగాలన్నారు. రైతుభరోసా కేంద్రాల(ఆర్‌బికె)పై అవగాహన కల్పించే బాధ్యత కలెక్టర్లదేనని చెప్పారు.

మే 30 నుంచి ఆర్‌బికెలు వస్తాయన్నారు. మరో ఏడాదిలోగా జనతా బజార్‌లుకూడా అందుబాటులో ఉంటాయన్నారు. మత్స్యకార భరోసా, రైతు భరోసా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలన్నారు. రైతులకు క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు వచ్చే అక్టోబరు నాటికి అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
 
రెవిన్యూ వ్యవస్థను పటిష్టపరచడంలో భాగంగా ప్రతి జిల్లాకు ముగ్గురు జాయింట్‌ కలెక్టర్లను త్వరలోనే నియమిస్తున్నట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు