శోభానాయుడు మృతి పట్ల ఏపి గవర్నర్ సంతాపం

బుధవారం, 14 అక్టోబరు 2020 (21:20 IST)
ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి డాక్టర్ శోభానాయుడు ఆకస్మిక మృతి పట్ల  ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి బుధ‌వారం ఒక ప్రకటన విడుద‌ల చేశారు.

గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ వెంపటి చిన్న సత్యం శిష్యురాలిగా డాక్టర్ శోభానాయుడు కుచిపుడి కళా ప్రక్రియలో విశేష పరిణితిని సంపాదించి దేశ, విదేశాలలో వేలాది ప్రదర్శనలు ఇచ్చారన్నారు. పిన్నవయస్సులోనే నాట్య సంబంధమైన నాటక ప్రక్రియలో ప్రధాన పాత్రలు పోషించి ఆహుతులను మెప్పించారని ప్రస్తుతించారు. 

సత్యభామ, పద్మావతి వంటి పాత్రలకు జీవం పోసి అద్బుతమైన నాట్య కౌశలాన్ని సొంతం చేసుకున్న ఘనత ఆమెకే దక్కిందని పేర్కొన్నారు. డాక్టర్ శోభానాయుడు తాను నేర్చుకున్న విద్య కలకాలం ఉండాలన్న భావనతో ఎందరికో శిక్షణను ఇచ్చి, వారిని సైతం పరిపూర్ణ కళాకారులుగా తీర్చి దిద్దటం విశేషమని హరిచందన్ పేర్కొన్నారు. 

విశ్వ వ్యాపంగా కూచిపూడి నృత్యం విశేష ప్రజాదరణను గడించటానికి ఇది దోహదపడిందని గవర్నర్ వివరించారు. శోభానాయిడు ఆత్మ ప్రశాంతంగా ఉండాలని పూరి జగన్నాధ స్వామిని,  తిరుమల శ్రీవెంకటేశ్వరుడిని వేడుకుంటున్నానని, కుటుంబ సభ్యులకు తన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నానని గవర్నర్ అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు