అచ్చెన్నాయుడు.. పైకి నీతులు చెబుతూ క్షేత్రస్థాయిలో దుర్మార్గాలు : మంత్రి ధర్మాన

మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (18:26 IST)
టీడీపీ నేత అచ్చెన్నాయుడు పైకి నీతులు చెబుతూ క్షేత్రస్థాయిలో దుర్మార్గాలకు పాల్పడుతున్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సొంతగ్రామంలో తనకు వ్యతిరేకంగా నామినేషన్ వేస్తున్న  సర్పంచ్ అభ్యర్థి కింజరాపు అప్పన్నను బెదిరించారు. 
 
కింజరాపు కుటుంబానికి చెందిన వ్యక్తే పోటీ చేస్తున్నా... అతన్ని అడ్డుకొని దౌర్జన్యం చేయటం చాలా బాధాకరం. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికలను టీడీపీ నేతలే అడ్డుకుంటున్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు పైకి నీతులు చెబుతూ..  క్షేత్రస్థాయిలో దుర్మార్గాలు చేస్తన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వగ్రామంలోనే దౌర్జన్యం చేసి నామినేషన్లు వేయకుండా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ప్రవర్తించటం దురదృష్టకరం. 
 
నిన్న జరిగిన సంఘటనపై కింజరాపు అప్పన్న ఎన్నికల కమిషన్ కి, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయటం జరిగింది. ఎస్‌ఈసీకి విన్నవించుకున్నాక ఇవాళ అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు. దాన్ని కూడా తప్పుపట్టి వైయస్‌ఆర్‌సీపీపై రామ్మోహన్ నాయుడు ఇతర టీడీపీ నేతలు బురద చల్లే కార్యక్రమం చేయటం బాధాకరం. 
 
రాష్ట్రంలో 175 స్థానాల్లో 151 స్థానాల్లో వైయస్‌ఆర్‌సీపీని అఖండమైన మెజార్టీతో గెలిపించి శ్రీ జగన్ గారికి ప్రజలు మద్దతు ఇచ్చారు. ఎన్నికలు అయిన తర్వాత సీఎం శ్రీ జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నేటి వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. 
 
2018లో జరగాల్సిన పంచాయితీ ఎన్నికలను చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ లే ఇంతకాలం జరగనివ్వలేదు. కరోనా కట్టడి చేసే దిశగా అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలనే లక్ష్యంతో నెలా, రెండు నెలల తర్వాత ఎన్నికలు నిర్వహిద్దామని  కోరినా హఠాత్తుగా నిమ్మగడ్డ రమేశ్‌ ఎన్నికలకు ఆదేశించారు. 
 
రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, సీఎం శ్రీ జగన్ ఆలోచిస్తున్నారు. ప్రజలంతా సీఎం శ్రీ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. అయితే, ఎన్నికలంటే వైయస్‌ఆర్‌సీపీకి భయమన్నట్లు, టీడీపీ ప్రజల్లో విశ్వాసం పొందినట్లు ఆ పార్టీ నాయకులు మాట్లాడటం హాస్యాస్పదం. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారి నేతృత్వంలో ప్రజారంజకంగా పాలన జరుగుతోంది. ప్రజలకు చేరువగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ వ్యవసాయం, విద్య, వైద్యంకు ప్రాధాన్యం ఇస్తూ పాలన జరుగుతోంది. 
 
ప్రజల గడప వద్దకే పరిపాలన తీసుకెళ్ళే చర్యల్లో భాగంగా... గ్రామ సచివాలయ వ్యవస్థ, ఉద్యోగుల నియామకం, గ్రామ, వార్డు వాలంటీర్లు నియామకాలను ప్రజలు చూశారు. ఇప్పటికే ప్రజలకు చేరువగా వాలంటీర్లు వ్యవస్థ ద్వారా పరిపాలన సాగుతోంది.  1వ తేదీ నుంచి వాహనాల ద్వారా నాణ్యమైన బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది. 
 
ప్రతి కుటుంబానికి సరైన తూకంతో, దళారీ వ్యవస్థ లేకుండా సరుకులు అందజేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో అందజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఎన్నికల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో తాత్కాలికంగా వాయిదా వేయటం జరిగింది. 
 
ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు మాట్లాడుతుంటే ప్రజలు ఇవన్నీ ఆలోచిస్తారు.  ప్రజలు ఎవ్వరూ టీడీపీని ఇష్టపడటం లేదు. దౌర్జన్యాలు, తప్పులు టీడీపీ నేతలు చేసి ఎదుటివారిపై ఆరోపణలు చేయటం ఎంతవరకు కరెక్ట్‌? ఒక విమర్శ చేసేటప్పుడు అది సద్విమర్శ అయి ఉండాలి. వారు గతంలో వ్యవహరించిన తీరు ఏంటో ఆలోచన చేయాలి. ఇటువంటి పోకడల వల్లే టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. 
 
త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయని టీడీపీనే అధికారంలోకి వస్తుందని అచ్చెన్నాయుడు చెబుతున్నారు. అప్పుడు నేనే హోంమంత్రిని అవుతా. పోలీసుల భరతం పడతానని మీడియా ముందు అచ్చెన్నాయుడు ప్రగల్భాలు పలకడం మంచిది కాదు. ఎన్నికలు రావటం ఎప్పుడు, అచ్చెన్నాయుడు హోంమంత్రి అవ్వటం ఎప్పుడు, చంద్రబాబు సీఎం అవ్వటం ఎప్పుడు ఇదంతా ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజల తీర్పుకు వదులుదాం. ప్రజాతీర్పు ఎంతో ముఖ్యం. మీ పాలనపై మొన్ననే ప్రజాతీర్పు ఇచ్చారు. కలలు కనటం టీడీపీ నేతలు ఇకనైనా మానేయండి. ముందు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలి అని మంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు