కాపు నేస్తం కాదు కాపు దగా: నిమ్మకాయల చిన్న రాజప్ప

బుధవారం, 24 జూన్ 2020 (22:49 IST)
"రైతు భరోసా కింద కాపులకు జగన్ ఇస్తుంది 1497 కోట్లే. తెలుగుదేశం రైతు బుణమాఫీ కింద కాపులకు చేసింది రూ.4500 కోట్లు. ఇది కాకుండా అదనంగా రూ. 1000 కోట్లు వారి సంక్షేమానికి ఖర్చు చేయడం జరిగింది.

కాపు నేస్తమంటూ కాపు మహిళలకు జగన్ ప్రభత్వం ఇస్తున్నది కేవలం రూ.354 కోట్లు మాత్రమే. కాపు మహిళల్లో 10 శాతం మందికి మాత్రమే ఇచ్చి మోసం చేస్తున్నారు" అంటూ మాజీ మంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప ముఖ్యమంత్రి జగన్ పైమండిపడ్డారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు.
 
"కాపులకు రూ. 400 కోట్లను మాత్రమే ఇస్తూ రూ.4000 కోట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్లను రద్దు చేసింది వాస్తవమా కాదా? కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలకు మించి ఉండరాదని, 3 ఎకరాలలోపు తరి లేదా 10 ఎకరాల మెట్ట, లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు మాత్రమే ఉండాలని నిబంధన విధించారు.

అయితే.. మొన్నటి బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు కులస్తులు సుమారుగా కోటిన్నర మంది ఉన్నట్లు జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆ లెక్కన చూసుకుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా కాపు మహిళల సంఖ్య దాదాపు అరకోటికి పైగానే ఉంటుంది. అందులో 25 లక్షల మంది కాపు మహిళలకు అర్హత వున్నా దాన్ని 2,35,873 మందికి కుదించారు

అధికారంలోకి వస్తే.. ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు మహిళలకు 45 ఏళ్లకే రూ.3వేల చొప్పున పెన్షన్ ఇస్తామని పాదయాత్రలో ఊదరగొట్టారు. కాపు కార్పొరేషన్ ద్వారా కాపు యువతకు అందాల్సిన 45వేల రుణాలను రద్దు చేయడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను దెబ్బతీయడం కాపు ద్రోహం కాదా.?

ఇలాంటి విషయాలపై కాపుల్లో వ్యతిరేకత పెరగకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి కాపు నేస్తం అంటూ కొత్త మోసపూరిత పథకానికి తెరలేపారు. కాపు నేస్తం అమలుపై చిత్తశుద్ధి ఉంటే.. తొలి ఏడాది కాపు నేస్తం పథకాన్ని ఎందుకు అమలు చేయలేదు.? 

గతేడాది బడ్జెట్ లో కాపులకు రూ.2వేల కోట్లు కేటాయించామని ఆర్భాటంగా ప్రకటించుకుని.. అందులోనూ పించన్లు, అమ్మఒడి మినహాస్తే కాపులకు నికరంగా ఇచ్చినది. రూ.401 కోట్లు మాత్రమే. రూ.1600 కోట్లు గత ఏడాది ఎగనామం పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం పించన్లు కాకుండానే ఏడాదికి రూ.1000 కోట్లు ఖర్చు చేసింది. 

తెలుగుదేశం హాయాంలో కాపులకు న్యాయం
బీసీ కమిషన్‌ను నియమించడం ద్వారా రిజర్వేషన్‌ కేటాయింపునకు ఎలాంటి ఇబ్బందులు భవిష్యత్‌లో ఎదురుకాకుండా చూశాం. కేంద్రం ప్రకటించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో 5శాతం రిజర్వేషన్లను ఆర్థికంగా వెనుకబడిన కాపులకు కేయించి చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం.

ప్రస్తుతం వెనకబడిన తరగతుల్లో ఉన్న ఏ ఒక్కరికి నష్టం జరగకుండా కొత్తగా ''ఎఫ్‌'' కేటగిరిని చేర్చి 5 శాతం రిజర్వేషన్‌ కల్పించాం. కాపులకు శాశ్వత ప్రయోజనం కలిగించాలనే లక్ష్యంతో ఎన్నికల హామీల్లో భాగంగా కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం. కాపు కార్పొరేషన్‌ ద్వారా రూ.3100 కోట్ల నిధులు కాపుల సంక్షేమం కోసం ఖర్చు చేశాం.

ఎన్టీఆర్‌ విదేశీ విద్యాదరణ పధకం ద్వారా 4,528 మంది కాపు విద్యార్ధులకు లబ్ధి, ఎన్టీఆర్‌ ఉన్నత విద్యా పధకం ద్వారా రూ.28.26 కోట్లతో 1,413 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూర్చాం. ప్రతి జిల్లాలో కాపు భవన్‌లను నిర్మించాం. ఒక్కో భవనానికి రూ.5కోట్లు కేయించాం. కాపులకు రిజర్వేషన్‌ అంశాన్ని పార్లమెంటు సాక్షిగా  మోడీని ప్రశ్నించాల్సి వస్తుందన్న భయంతో వైసీపీ ఎంపీలు దొంగ రాజీనామాలు చేశారు.

జగన్మోహన్‌ రెడ్డి కాపు రిజర్వేషన్‌ కేంద్రం పరిధిలోనిదంటూ చేతులెత్తేసి.. అధికారంలోకి వచ్చీ రాగానే.. తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిన 5శాతం రిజర్వేషన్‌ను కూడా రద్దు చేశారు. ఇచ్చిన రిజర్వేషన్‌ను ఎత్తేసి.. కాపుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామంటూ అబద్ధాలు చెబుతూ కాపు సామాజిక వర్గం మొత్తాన్ని మోసం చేస్తున్నారు.

అసలు కాపులకు తెలుగుదేశం ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్‌ను ఎత్తివేయడానికి ఇంత వరకు స్పష్టమైన కారణాన్ని చెప్పకుండా.. రిజర్వేషన్‌ కల్పించడాన్నే తప్పుబట్టడం కాపు సామాజిక వర్గానికి ద్రోహం చేయడమే" అని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు