ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనలను పెంపొందించుకోవాలి: మండలి బుద్ధ ప్రసాద్

బుధవారం, 30 డిశెంబరు 2020 (19:55 IST)
ఆధ్యాత్మిక భావనల ద్వారానే మనసు ప్రశాంతంగా ఉంటుందని,మనలో చక్కటి ఆలోచనలు వస్తాయని రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. ఆధ్యాత్మిక విశ్వ గురువు, సైంటిఫిక్ సెయింట్" శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్ఫూర్తి రచనలపై చర్చ - 2021 కాలమాని” ఆవిష్కరణ కార్యక్రమం సివిల్ కోర్టుల వద్ద గల డాక్టర్ కె.యల్.రావు భవన్ వేదిక నందు బుధవారం జరిగింది.

ఈ సందర్భంగా కాలమానిని బుద్ధ ప్రసాద్, పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, విశ్వస్పూర్తి సభ్యులు సంయుక్తంగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గడచిన సంవత్సరం అంతా ప్రతి ఒక్కరూ చాలా బాధగాను, ఎన్నో మానసిక వేదనలతో ఉన్నారన్నారు. రానున్న కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా విహరించే విధంగా ఉండాలని ఆవిధంగా ప్రతి ఒక్కరికీ ధైర్యం కావాల్సిన అవసరం ఉందన్నారు.

ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడంతో పాటు ఆధ్యాత్మిక భావనలను పెంపొందించుకోవడం ద్వారానే ఆరోగ్యంతో పాటు ఆహ్లాదకరంగా ఉండగలుగుతారని గురువు విశ్వస్ఫూర్తి తెలియచేసారన్నారు. శ్రీశ్రీ శ్రీ గురు విశ్వస్పూర్తి 36కు పైగా గ్రంధాలు రచించారని, వారి రచనలు నేటి ఆధునిక సమాజ అభ్యుదయానికి, మానవత్వం పెంపొందించడానికి దోహపడ్డాయని తెలిపారు.
 
శతావధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ మాట్లాడుతూ మనిషి ప్రగతికి, అవరోధానికి మానవ మనసే కారణమని అన్నారు. మనసును శక్తివంతం చేసుకోవడానికి, మనసును అంతకరణ మనసుగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలన్నారు. నేటి సమాజంలో కరోనా వంటి విపత్తులను తట్టుకుని మనిషి నిలబడటానికి విశ్వస్పూర్తి రచనలు, సిద్ధాంతాలు దోహద పడతాయని తెలిపారు.
 
ఆర్ధికశాస్త్ర ఉపన్యాసకులు ఆల్వా సాయి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వస్పూర్తి ధ్యాన జ్ఞాన మార్గ్ కమిటీ సభ్యులు సి. హెచ్. చంద్రశేఖరరావు, పి. రాఘవరావు, ఆర్.సుబ్బారావు, ఆర్.సి. హెచ్. వెంకట రామయ్య, వి. సైదారెడ్డి, విశ్వస్ఫూర్తి సభ్యులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు